దేశంలో కరోనా వ్యాప్తి తీరు తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ చేపట్టిన సర్వే ఫలితాలను బుధవారం వెల్లడించింది. సమూహ వ్యాప్తిపై అనేక అనుమానాలు నెలకొంటున్న వేళ... ఈ సర్వే ఫలితాలు ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చాయి. తొలుత దేశవాప్తంగా 69జిల్లాల్లో ఐసీఎంఆర్ సీరం సర్వేని నిర్వహించింది. తెలంగాణలో మే 15నుంచి 17వరకు ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో శాంపిళ్లు సేకరించారు.
విశ్లేషించిన తర్వాత...
నల్గొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 400 చొప్పున 1200 రక్తనమూనాలు తీసుకున్నారు. ఆ తర్వాత మే 30, 31 తేదీల్లో దేశంలోని 13 హాట్ స్పాట్ నగరాల్లో ఒకటైన భాగ్యనగరంలోనూ 500 శాంపిళ్లు సేకరించారు. హైదరాబాద్ నగరంలో కేసులు అధికంగా ఉన్న చందానగర్, మియాపూర్, టప్పాచబుత్ర, ఆదిభట్ల , బాలాపూర్లలో ఒక్కో కంటైన్మెంట్ నుంచి 100 చొప్పున రక్తనమూనాలు సేకరించారు. వాటిని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ట్యుబెక్యులోసిస్ సంస్థలో విశ్లేషించిన తర్వాత.... తెలంగాణలో కమ్యునిటీ స్ప్రెడ్ లేదంటూ ఐసీఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.