తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీస్‌ శాఖలో కరోనా కలవరం.. 50 మందికి వైరస్

పోలీస్ శాఖలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లాక్​డౌన్ విధుల్లో పాల్గొంటున్న కానిస్టేబుళ్లలో కొంతమంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పుడు క్రమంగా పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం సిబ్బంది సహా ఠాణాలు, ఏఆర్‌, నేర పరిశోధన విభాగంలో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బందికీ వైరస్‌ వ్యాప్తి చెందుతూ వస్తోంది. ప్రస్తుతం మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది సహా 50 మందికి పైగా వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

telangana police
telangana police

By

Published : Jun 2, 2020, 7:21 AM IST

కరోనా ప్రస్తుతం పోలీసులనూ కలవరపెడుతోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్‌ సోకిన వారి వద్దకు వెళ్లాల్సి రావడం, ఆసుపత్రులు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు వంటి విధులు నిర్వహిస్తుండటంతో వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

అన్ని విభాగాలకూ

పోలీసు శాఖలో పాజిటివ్‌ కేసులు బయటపడిన తొలి నాళ్లలో ట్రాఫిక్‌, శాంతిభద్రతల విభాగాల్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లే బాధితులయ్యారు. క్రమంగా పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం సిబ్బంది సహా ఠాణాలు, ఏఆర్‌, నేర పరిశోధన విభాగంలో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బందికీ వైరస్‌ వ్యాప్తి చెందుతూ వస్తోంది. ప్రస్తుతం మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది సహా 50 మందికి పైగా వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మరికొందరు అనుమానిత లక్షణాలతో స్వీయ నిర్బంధంలో ఉన్నారని తెలిసింది. రోజురోజుకూ బాధితులు పెరుగుతుండడంతో ఉన్నతాధికారులు స్వీయ భద్రత చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. యాభై ఏళ్లు, ఆపై వయసున్న వారు తమ రోజూవారీ ఆరోగ్య పరిస్థితిని ఠాణాలో చెప్పాలంటూ మౌఖికంగా ఆదేశించారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో కొందర్ని వేరే ప్రాంతాలకు మార్చారు.

డీజీపీ కార్యాలయంలో కలకలం

డీజీపీ కార్యాలయంలో తాజాగా ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. పోలీస్‌ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించే విభాగంలో పనిచేస్తున్న ఆయనకు పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుణ్ని ఆసుపత్రికి తరలించారు. ఆయన విధులు నిర్వర్తించే ప్రాంతాన్ని శానిటైజ్‌ చేశారు. సదరు బాధితుని కుటుంబ సభ్యులు కిరాణా దుకాణం నిర్వహిస్తున్న నేపథ్యంలో, అక్కడే ఆయనకు వైరస్‌ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఏఎస్సై ఇంట్లో 11 మందికి...

ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై పాతబస్తీలో నివాసముంటున్నారు. ఆయన కుమారులిద్దరూ కానిస్టేబుళ్లే. కొద్దిరోజుల క్రితం ఏఎస్సై అస్వస్థతగా ఉన్న మనవడిని చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రివేళల్లో అక్కడే ఉంటూ చిన్నారి బాగోగులు చూసుకున్నారు. రెండు రోజుల తర్వాత దగ్గు, జలుబు లక్షణాలు కన్పించడంతో సెలవు పెట్టారు. తర్వాత అనుమానంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. కుటుంబ సభ్యులందర్నీ క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఏఎస్సై భార్య, ఆయన కుమారులు, వారి భార్యలు, మనవళ్లు, మనవరాళ్లు ఇలా మొత్తం పదకొండు మందికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆ కుటుంబమంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఇదీ చదవండి:ఆగని కరోనా.. మరో 94 కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details