ఏపీలో మరో అమానుషం... చెత్త బండిలో ఆస్పత్రికి తరలింపు ఏపీ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జర్జాపుపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు కరోనా బాధితులను చెత్త ఆటోలో తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆందోళన చెందిన బాధితులు... వెంటనే తమను ఆసుపత్రికి తరలించాలని గ్రామ పెద్దలను ఆశ్రయించారు. 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో స్థానికులు, గ్రామ పెద్దలు సమకూర్చిన చెత్త ఆటోలోనే వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దయనీయ పరిస్థితి అందరినీ కలిచి వేస్తోంది.
అమానుషం...
ఈ ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌కు ప్రచారమే తప్ప... ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక చెత్త ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని ప్రశ్నించారు. కరోనా బారిన పడిన వారిని కనీసం మనుషుల్లా చూడకుండా చెత్త బండిలో తరలించడం అమానుషమని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపులు ఆపి ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
ఇవీ చూడండి : నేను చెప్పినదాంట్లో తప్పులుంటే జైలుకెళ్లేందుకు సిద్ధం : ఎన్‌ఎస్‌యుఐ