ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు జిల్లా అధికారులకు ముచ్చెమటలను పట్టిస్తున్నాయి. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిలో చాలామంది బాధితులు పత్తా లేకుండా పోయారు. ఆధార్ కార్డులో ఉన్న చిరునామాలలో బాధితులు లేకపోవడం, వారి సెల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి ఐసోలేషన్లో చికిత్స అందించాలి. కానీ కరోనా సోకిందంటే సమాజంలో, బంధువుల్లో చిన్న చూపునకు గురైవుతున్నామనే ఉద్దేశ్యంతో వీరంతా తమ చిరునామాలు తప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
పరీక్షల సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్కు సమాచారం వచ్చిన వెంటనే స్విచ్ఛాప్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాజిటివ్ వచ్చిన వారు విచ్చలవిడిగా తిరుగుతూ వైరస్ ఉద్ధృతి కారణమవుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో, వైద్యారోగ్యశాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేయడంతో దర్యాప్తు చేశారు.