ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహిస్తున్నారు. తొలిసారి 'సాఫ్ట్‌వేర్' ఆధారంగా ఎంపిక చేసిన వారికి మాత్రమే విడతల వారీగా కరోనా టీకా ఇచ్చే విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు కొవిన్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా లింకుకు అనుసంధానం చేశారు. ఈ లింకు ద్వారా సంక్షిప్త సమాచారం వారికి అందుతుంది. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తల ఫోన్లకు శుక్రవారం రాత్రికే తెలుగులో సంక్షిప్త సందేశం వచ్చింది. ఎప్పుడు, ఎక్కడికి రావాలనే సమాచారం అందులో ఉంటుంది. అయితే.. ఈ ప్రక్రియలో టీకా వేయడమంటూ ఉండదు. అసలైన టీకా అందుబాటులోకి వచ్చాక అమలు చేయాల్సిన విధానంపై మాత్రమే కసరత్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో 3 కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. అమరావతి రోడ్డులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఏటీ అగ్రహారం ఎస్.కె.బి.ఎం. పురపాలక ఉన్నత పాఠశాల, మంగళగిరి రోడ్డులోని వేదాంత ఆస్పత్రిలో డ్రై రన్‌కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో 25 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి సన్నాహక ప్రక్రియలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే తొలివిడతగా డిసెంబర్ 28న కృష్ణా జిల్లాలో డ్రై రన్ నిర్వహించారు.