కొవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్(ఏబీ) పథకంలో కరోనాకు చికిత్సను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా రాష్ట్రంలో ఏబీని అమలు చేస్తుండటంతో ఇది సాధ్యమైందని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇకనుంచి ‘ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్’ పేరిట ఈ పథకం అమలవుతుంది. కరోనాకు అందించే చికిత్సలను మొత్తంగా 17 రకాలుగా విభజించారు. ఇందులో ‘అక్యూట్ ఫెబ్రైల్ ఇల్‌నెస్’.. ‘పైరెక్సియా ఆఫ్ అన్‌నోన్ ఆరిజిన్’.. ‘నిమోనియా’ ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే వైద్యం అందిస్తారు. దశలవారీగా ప్రైవేటు దవాఖానాలకు విస్తరించే అవకాశం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ రాకతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 పడకలున్న ఆసుపత్రులకు అనుమతి లభిస్తోంది. ఆయుష్మాన్ భారత్ చేరికతో ఇకనుంచి 6 పడకలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. 6 పడకలున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ‘ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్’ను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాక, దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
ఇక సాధారణ చికిత్సలు కూడా...
*రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 1026 చికిత్సలు ప్రస్తుతం అమలులో ఉండగా.. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్.. రెండింటిలో కలసిన చికిత్సలు 810 ఉన్నాయి. మరో 216 ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆయుష్మాన్ భారత్‌లో లేవు. ఈ చికిత్సలను గతంలో మాదిరిగానే ఇప్పుడూ కొనసాగిస్తున్నారు.
*ఆరోగ్యశ్రీ పరిధిలో 77.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతుండగా.. ఏబీ పథకం పరిధిలోకి కేవలం 24 లక్షల కుటుంబాలు మాత్రమే వస్తాయి. దీన్ని అమలు చేయడం ద్వారా చికిత్సలకయ్యే వ్యయంలో 60 శాతం కేంద్రం భరిస్తుంది. మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఏబీ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు రూ.250 కోట్ల వరకూ నిధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు చెప్పాయి.
*ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షలు వర్తిస్తుంది. ఆయుష్మాన్ భారత్‌లో అన్ని చికిత్సలకూ రూ.5 లక్షల వరకూ గరిష్ఠ పరిమితి ఉంటుంది.