గర్భిణులపై కరోనా రెండో దశ ప్రభావం ఎలా ఉంది?
రెండో దశలో కరోనా వైరస్ సోకిన గర్భిణులు వెంటనే కోలుకోవడం కష్టమైంది. కొంతమందిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపించి వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వచ్చింది. గర్భిణులు సాధారణం కంటే ఆరు నుంచి ఎనిమిది కేజీల బరువు పెరుగుతారు. అదే సమయంలో వారి పొట్ట ఊపిరితిత్తులను తన్నిపెట్టి ఉంటుంది. దీనివల్ల వీరి ఊపిరితిత్తులు సాధారణ వ్యక్తుల్లా పూర్తి స్థాయిలో పనిచేయవు. కరోనా సోకినవారిలో చాలా మందిని ఆక్సిజన్ కోసం బోర్లా పడుకోబెట్టి వైద్యం చేస్తుంటాం. గర్భిణులకు అలా చికిత్స చేయడానికి కూడా కుదరదు.
కరోనా వైరస్ సోకిన మహిళల్లో తక్కువ రోజుల్లోనే ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తోంది. ఇటువంటి కేసుల్లో హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ, ఎన్‌ఐవీ వ్యవస్థల ద్వారా అధికస్థాయిలో ఆక్సిజన్ అందించాల్సి ఉంది. ఈ వ్యవస్థల ద్వారా ఆక్సిజన్ ఇచ్చినపుడు కొందరు గర్బిణులు తట్టుకోలేకపోయారు. వారు కోలుకోవడం కష్టమైంది. కరోనాతో ఉన్న గర్భిణుల అప్పటి పరిస్థితిని బట్టి ఏడు, ఎనిమిది నెలల్లో ముందుగానే పురుడు పోశాం. ఇలాంటి వారు తొందరగా కోలుకున్నారు.
ఒకవేళ మూడో దశ కరోనా వస్తే మాత్రం గర్భిణుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రెండో దశలో వెంటిలేటర్ మీదకు వెళ్లిన గర్భిణులకు పూర్తి వైద్యం అందించినా కూడా అప్పటికే వారి ఊపిరితిత్తులు 70 శాతం పాడవడంతో చికిత్స పొందుతూనే మరణించారు. మూడో దశలో మరింత తీవ్ర లక్షణాలున్న కరోనా వైరస్ ప్రబలితే అప్పుడు గర్భిణులకు అందరికంటే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. వారి ఊపిరితిత్తుల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణుల పరిశీలనలో తేలింది.
మరి కొవిడ్ బారిన పడిన చిన్నారుల్లో..
వైరస్ సోకిన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోంది. 2-4 వారాల మధ్య మిస్-సీ వ్యాధి బారిన పడేలా చేస్తోంది. తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబారడం, ఒళ్లంతా దద్దుర్లు, వాపులు, రక్త సరఫరా తగ్గడం తదితరాలు లక్షణాలు ఉంటున్నాయి. గుండె, ఇతర అవయవాల పనితీరు సక్రమంగా ఉండదు. స్టిరాయిడ్స్ ఇవ్వడంతోపాటు ఇమ్యునోగ్లోబ్యులిన్ థెరపీ మొదలు పెట్టాలి. ఆలస్యంగా వైద్యం ప్రారంభిస్తే వెంటిలేటర్‌పై పెట్టాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇప్పటివరకు మరణాలు పెద్దగా లేకపోయినా పరిస్థితి విషమంగా మారిన సందర్భాలున్నాయి. రెండు వారాల కిందటి వరకు ఈ కేసులు చాలా వచ్చాయి. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఈ లక్షణాలున్న పిల్లలను తల్లిదండ్రులను వెంటనే గుర్తించి ఆసుపత్రుల్లో చేర్చించాలి.