రాష్ట్రంలో కరోనా పరీక్షలు, గణాంకాల వెల్లడిపై ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన పలు కేసులపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల అనుగుణంగా రాపిడ్ యాంటీజెంట్ టెస్టులు నిర్వహించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింత ఎక్కువగా చేయాలని సూచిందింది. పది రోజుల్లో 50వేల కరోనా పరీక్షలు జరుపుతామని సర్కారు వివరించగా... రోజుకు 5 వేలు జరిపితేనే ఇది సాధ్యమవుతుందని హైకోర్టు పేర్కొంది. కేరళ తరహాలో సంచార కరోనా పరీక్షలు నిర్వహించడం ఎందుకు కష్టతరమో వివరించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావును ఆదేశించింది.
విస్తృత ప్రచారం చేయాలి..
కరోనా కేసుల వివరాలు మీడియా బులెటిన్లలో ప్రజలకు మరింత వివరంగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల గణాంకాలు వార్డుల వారీగా వెల్లడించి, కాలనీ సంఘాలకు ఎప్పటికప్పుడు తెలపాలని ఆదేశించింది. దానివల్ల స్థానిక ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారని పేర్కొంది. గాంధీతో పాటు రాష్ట్రంలో 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు వివరించగా... రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చాలా మందికి తెలియదని, ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది.