తెలంగాణ

telangana

ETV Bharat / city

కొవిడ్​ విజృంభిస్తున్నా వైరస్​ నిర్ధారణ పరీక్షలు తక్కువే - కరోనా తాజా వార్తలు

ఏపీలో కరోనా విజృంభిస్తున్నా.. నిర్ధారణ పరీక్షలు ఆ స్థాయిలో జరగడం లేదు. అందువల్లే వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తోందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ సోకినవారిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. వెంటనే చికిత్స అందించేందుకు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను వేరు చేసేందుకు, ఆయా ప్రాంతాల్లో కట్టడి చర్యలు చేపట్టి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుంటుంది.

corona cases in andhra pradesh
కొవిడ్​ విజృంభిస్తున్నా వైరస్​ నిర్ధారణ పరీక్షలు తక్కువే

By

Published : Apr 14, 2021, 7:56 AM IST

ఏపీలో కరోనా విజృంభిస్తున్నా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఆ స్థాయిలో జరగడం లేదు. అందువల్లే వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తోందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ సోకినవారిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. తదుపరి చర్యలు తీసుకొని.. కొవిడ్​‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుంటుంది. ఏపీలో రోజూ 90 వేల నుంచి లక్ష నమూనాల్ని పరీక్షించే సామర్థ్యమున్నా.. ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు ఏ రోజూ పరీక్షల సంఖ్య 40 వేలు దాటకపోవడం గమనార్హం.

ప్రధాని చెప్పినా..

పరీక్షలు పెరగకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో జాప్యమవుతోంది. అనుమానిత లక్షణాలున్నా చాలామంది మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతుండటం వల్ల వైరస్‌ వేగంగా సంక్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పరీక్షల పెంపుపై వెంటనే దృష్టి పెట్టాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్ని పెంచాలని కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు పదేపదే సూచిస్తోంది. ‘పరీక్షలు పెంచండి... వెనుకాడొద్దు’ అని ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.

గతేడాది రూ.100 కోట్ల వ్యయం

గతేడాది కరోనా పరీక్షలు చేసే ల్యాబ్‌లు సరిపడా లేక అనేక సమస్యలు తలెత్తాయి. క్రమంగా 14 ప్రభుత్వ, 18 ప్రైవేట్‌ వైద్య కళాశాలల ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ ద్వారా నమూనాల్ని పరీక్షించేందుకు మౌలిక సదుపాయాలు సమకూర్చారు. క్షయ నిర్ధారణ కోసం ఉపయోగించే ట్రూనాట్‌ యంత్రాలు, ఎయిడ్స్‌ పరీక్షలు చేసే నాకో మిషన్లతోనూ నమూనాలను పరీక్షించారు. కొత్తగా 100 ట్రూనాట్‌ యంత్రాలు కొన్నారు. వీటన్నింటికీ ఏపీ ప్రభుత్వం సుమారు వంద కోట్లు ఖర్చుపెట్టింది. 26 ప్రైవేట్‌ ల్యాబ్‌లలోనూ నమూనాల పరీక్షకు కేంద్రం ఆమోదం తెలిపింది. తొలుత ర్యాపిడ్‌ యాంటీజెన్‌ ద్వారా నమూనాల్ని పరీక్షించారు.

గరిష్ఠంగా 88,778 పరీక్షలు..

ఏపీలో గత ఏడాది అక్టోబరు చివరి వారంలో ఒకరోజు గరిష్ఠంగా 88,778 నమూనాల్ని పరీక్షించారు. వైరస్‌ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలే నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో మార్చి 16 నుంచి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల వివరాలను వైద్యారోగ్యశాఖ బులిటెన్లలో పేర్కొనడం లేదు. కానీ రోజుకు సగటున 1,500 వరకు ఈ పరీక్షలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వీటిని చేయక తప్పడం లేదని వైద్యులు చెబుతున్నారు.

నమూనాలు తక్కువ

అనుమానిత లక్షణాలున్న వారి నుంచి, ర్యాండమ్‌గా సేకరించిన నమూనాల్ని పరీక్షించి ఫలితాలు ఇవ్వడం ల్యాబ్‌ల బాధ్యత. ఓ ప్రభుత్వ వైద్య కళాశాలకు రోజుకు 4,500 నమూనాల్ని పరీక్షించే సామర్థ్యం ఉంది. ఇక్కడికి 3,500 వరకే నమూనాలు వస్తున్నాయి. ఒక్కోసారి అంతకన్నా తగ్గుతున్నాయి. దీనికి తోడు నమూనాల్ని అన్ని ప్రాంతాల నుంచి కాకుండా ఒకేచోట నుంచి ఎక్కువగా సేకరించడం వల్ల వైరస్‌ ఉద్ధృతి తెలుసుకొనేందుకు అవకాశం ఉండటం లేదని ఓ మైక్రోబయాలజిస్ట్‌ చెప్పారు.

మళ్లీ ఆ స్థాయిలో సన్నద్ధమైతేనే..

గతేడాది వైద్య కళాశాలల్లోని ల్యాబ్‌లు 24 గంటలూ పనిచేశాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రీసెర్చి సైంటిస్టులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. కేసులు తగ్గుతుండటంతో సిబ్బందినీ తగ్గించారు. వారిని మళ్లీ నియమించి, ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటే పరిస్థితి మెరుగవుతుంది. అన్ని ప్రాంతాల నుంచి నమూనాల్ని సేకరిస్తే వైరస్‌ తీవ్రత తెలుస్తుంది. ‘కొంతమంది సిబ్బంది టీకాలు వేసే విధుల్లో ఉండటం వల్ల కూడా నమూనాల సేకరణ తగ్గింది. అవసరాలకు తగ్గట్లు సిబ్బందిని నియమించుకోవాలని సూచించాం. త్వరలోనే పరీక్షలు పెరుగుతాయి’ అని అధికారులు చెబుతున్నారు.

ప్రతిరక్షకాలు ఏర్పడ్డాయా?

టీకా తీసుకున్నవారిలో ప్రతిరక్షకాలు (యాంటీబాడీస్‌) వృద్ధి చెందాయా లేదా తెలుసుకొనేందుకు ప్రతి జిల్లాలో 4,200 మంది నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. వీరిలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోపాటు 3,600 మంది సాధారణ ప్రజలు ఉంటున్నారు. వైరస్‌ సోకనివారు, సోకినవారు, టీకా తొలి డోసు, రెండో డోసు తీసుకున్నవారి నుంచి పట్టణ, గ్రామ, గిరిజన ప్రాంతాల వారీగా నమూనాలు సేకరిస్తున్నామని పర్యవేక్షణ అధికారి డాక్టర్‌ మోహన్‌కృష్ణ తెలిపారు. ఈ నెల 17 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

టీకా తీసుకున్నా జాగ్రత్తగా ఉండాల్సిందే

కొవిడ్‌ టీకాలు పొందినప్పటికీ.. ముందస్తు జాగ్రత్తలు పాటించని వారిలో పలువురు కరోనా బారినపడుతున్నారు. గుంటూరు, విజయవాడ, అనంతపురం వంటి చోట్ల ఇలాంటి కేసులు బయటపడ్డాయి. మరోవైపు విజయవాడలో ఓ ఎంబీబీఎస్‌ వైద్యుడికి, అనంతపురం జీజీహెచ్‌లో ఓ దంత వైద్యురాలికి టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత పాజిటివ్‌ వచ్చింది. ఓ వైద్యుడు ఓపీలో చికిత్స అందిస్తూ వైరస్‌ బారినపడ్డారు. ఇలాంటివి సుమారు పది కేసులు వెలుగుచూశాయి. వీరికి తలనొప్పి, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు వెల్లడైంది. ఆయాసం, ఊపిరితిత్తుల్లో సమస్యలు కనిపించలేదు. సాధారణ చికిత్సతో వారం, పదిరోజుల్లోనే కోలుకున్నారని వైద్యులు పేర్కొన్నారు. కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న 14 రోజుల తర్వాత గానీ ప్రతిరక్షకాలు (యాంటీబాడీస్‌) పూర్తిస్థాయిలో ఏర్పడవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండో డోసు తీసుకున్న ఒకటి, రెండు రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్‌కు గురవడం లేదా అప్పటికే ఒంట్లో ఇన్‌ఫెక్షన్‌ ఉండటం వల్ల కొందరికి పరీక్షల్లో పాజిటివ్‌ వస్తోందని ఏపీ వైద్యనిపుణుల కమిటీ ముఖ్యప్రతినిధి, జనరల్‌ ఫిజీషియన్‌ సుధాకర్‌ వెల్లడించారు. టీకా వేయించుకున్నా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని విజయవాడ జీజీహెచ్‌ వైద్యులు దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు.

ఫలితాల వెల్లడిలోనూ జాప్యమే!

  • పరీక్షలు తక్కువ సంఖ్యలోనే జరుగుతున్నా కొన్నిచోట్ల ఫలితాలు సకాలంలో రావడం లేదు.
  • సేకరించిన మూడు రోజుల వరకు ఫలితాలు రాని నమూనాలు ఈ నెల 11 వరకు 70 వేలు ఉండటం గమనార్హం.
  • వారం వరకు ఫలితాలు అందనివి 15 వేల వరకు ఉన్నట్లు తెలిసింది.
  • నమూనాలు సేకరించే సిబ్బంది వివరాలు సరిగా నమోదు చేయకపోవడం, ఐడీ నెంబర్లు సరిపోలకపోవడం వల్ల త్వరితగతిన వాటిని పరీక్షించి ఫలితాలు ఇవ్వలేకపోతున్నామని, ఒక్కోసారి నమూనాలను తిరస్కరించాల్సి వస్తోందని ఓ మైక్రోబయాలజిస్ట్‌ వెల్లడించారు.

ఇవీచూడండి:రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు... జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

ABOUT THE AUTHOR

...view details