ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ తీవ్రతరం అవుతూనే ఉంది. మార్చి 12వ తేదీన నెల్లూరులో నమోదైన తొలికేసుతో మొదలైన కరోనా వ్యాప్తి సరిగ్గా 137 రోజుల అనంతరం 2 లక్షల మార్కును దాటేసింది. ఈ తీవ్రత ఏ స్థాయికి చేరుతుందన్నది ప్రస్తుతం అంచనాకు అందని పరిస్థితి. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారితో నెల్లూరులో నమోదైన తొలికేసుతో ఏపీలో వ్యాప్తి మొదలైంది. ఆ తదుపరి దిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా తీవ్రతరమైంది. లాక్డౌన్ ఎత్తివేత అనంతరం అన్లాక్ ప్రక్రియతోపాటు కోయంబేడు మార్కెట్లు ఏపీలో పరిస్థితిని దిగజార్చాయి.
వారం వ్యవధిలో...
జూన్ 1తేదీ నాటికి రాష్ట్రంలో 3,674 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. జూన్ 24 తేదీనాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్కును దాటింది. రాష్ట్రవ్యాప్తంగా జులై 24వ తేదీన నమోదైన కేసుల సంఖ్య 10,331గా వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక అక్కడి నుంచి వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. వారంరోజుల వ్యవధిలోనే... అంటే జులై 1వ తేదీ నాటికి మరో 5 వేల మందికి వైరస్ సోకింది. జులై ఒకటో తేదీన నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,252గా ప్రభుత్వం తన బులెటిన్లో పేర్కొంది. ఆ తదుపరి వారం వ్యవధిలో... అంటే జులై 6 తేదీన కరోనా కేసులు 20,019గా నమోదయ్యాయి.
ఆగస్టు 1వ తేదీన..
ఇక 9 రోజుల వ్యవధి అనంతరం జులై 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 35, 451కి చేరింది. 20 నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 50 వేల మార్కును దాటేసింది. ఆ తేదీన రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 53,274గా ప్రభుత్వం పేర్కొంది. ఇక 7 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రెట్టింపైంది. జులై 27వ తేదీన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్షమార్కును దాటి 1,02,349గా నమోదు అయినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక అక్కడినుంచి కేవలం 3 రోజుల వ్యవధిలో 50 వేల కేసులు దీనికి అదనంగా వచ్చి చేరాయి. ఇక ఆగస్టు 1వ తేదీన ఏపీలో 1 లక్షా 50 వేల 209 కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
జులై 19వ తేదీ నాటికి..
మార్చి 12న 24 గంటల వ్యవధిలో ఒక్క కేసు వ్యాప్తికి పరిమితమైన వైరస్... జులై 29వ తేదీ నాటికి రోజుకు గరిష్ఠ స్థాయిలో 10,093కు పాకింది. జూన్ 22వ తేదీన ప్రతీ రోజూ 500లోపు కేసులకు మాత్రమే పరిమితమైన వ్యాప్తి ఆ తదుపరి జులై 19వ తేదీ నాటికి 24 గంటల వ్యవధిలో 5,041కి పెరిగింది. జులై 29వ తేదీ నాటికి 10,093, జులై 30న 10,068 మందికి, జులై 31న 10,376 మందికి సోకింది. జులై నెలలో ప్రతీరోజూ పదుల సంఖ్యలోనే కొవిడ్ కారణంగా మరణాలు నమోదు అయ్యాయి. గరిష్ఠంగా ఆగస్టు 5న రాష్ట్రంలో 77 కొవిడ్ మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1753 మంది కొవిడ్ కారణంగా మృతిచెందారు.