మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంలో గ్రామీణుల్లో నెలకొన్న నిర్లిప్తత, అలక్ష్యం వైరస్ వ్యాప్తికి దోహదపడుతోంది. ఏపీలోని గ్రామాల్లో ఇప్పటికీ గుంపులుగా ఒకే చోట చేరి మాట్లాడుకుంటున్నారు. పనులు చేసే సమయంలోనూ భౌతికదూరాన్ని పాటించడం లేదు. దశలవారీగా లాక్‌డౌన్ తొలగించడంతో పెరిగిన ప్రజారవాణాకు తగ్గట్లు కేసులూ నమోదవుతున్నాయి. జులై నుంచే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఆ తరవాత బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు పునఃప్రారంభయ్యాక అవి మరింత ఎక్కువయ్యాయి. ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగిస్తుండటం వల్ల కూడా గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
- అనంతపురం జిల్లా యాడికి మండలంలో 535 వైరస్ కేసులు వచ్చాయి. వీటిలో మండల కేంద్రంలోనే ఏకంగా 256 కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. ఇక్కడి వారు తాడిపత్రి, కర్నూలు నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. నార్పల మండలంలో 408 కేసులు వచ్చాయి. నార్పలలోనే 175 కేసులు రికార్డయ్యాయి.
- కేసులు తక్కువగా ఉన్నాయని భావిస్తున్న కృష్ణా జిల్లాలోనూ..గ్రామీణ ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతుండటం గమనార్హం. ఈ జిల్లాలో తాజాగా ఆదివారం 8 కంటెయిన్‌మెంట్ జోన్లు ప్రకటించారు. బాపులపాడు మండలం మడిచర్ల గ్రామం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
విశాఖ, చిత్తూరు జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లోనే...!
- విశాఖపట్నం జిల్లాలో 2,646 వైరస్ కేసులు నమోదైతే...1,955 (74%) కేసులు పట్టణ ప్రాంతాల్లో వచ్చాయి. గ్రామీణ నేపథ్యంలో 691 (26%) కేసులు రికార్డయ్యాయి.
- చిత్తూరు జిల్లాలో మొత్తం 6,837 కేసులు వస్తే..3,619(53%) పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో (3,218) 47% చొప్పున కేసులు వచ్చాయి.
గిరిజన ప్రాంతాలకు పాకిన కొవిడ్