తెలంగాణ

telangana

ETV Bharat / city

'జనవరి వరకు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి'

దీపావళి పండుగ దృష్ట్యా కొవిడ్‌ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌ సూచించారు. బాణసంచాకు దూరంగా ఉండాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే ముప్పు తప్పదని హెచ్చరించారు. దీపావళి, శుభకార్యాల కోసం నిర్లక్ష్యంతో షాపింగ్ చేస్తున్నారని... రద్దీ ఉన్నచోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

srinivas
srinivas

By

Published : Nov 13, 2020, 1:59 PM IST

Updated : Nov 13, 2020, 3:08 PM IST

ప్రజలు బాణసంచాకు దూరంగా ఉండాలి : డీహెచ్ శ్రీనివాస్

కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా వచ్చే మూడు నెలలు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్‌ తెలిపారు. నవంబర్‌ నెలలో వివాహాలు చాలా ఉన్నాయని.. అయితే వచ్చే మూడు నెలల వరకు వివాహాలే కాకుండా ఇతరత్రా కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండటం మంచిదని శ్రీనివాస్​ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయని.. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్‌ వస్తుందని ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత 8 నెలలుగా పాటిస్తూ వస్తున్న కఠిన నియమాలను వచ్చే జనవరి వరకు ఆచరించాలని సూచించారు.

‘‘దీపావళి, వివాహాలు, శుభకార్యక్రమాల సందర్భంగా విస్తృతంగా షాపింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశాన్ని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సూచిస్తున్న అన్ని సూచనలను ఎక్కువ శాతం ప్రజలు పాటిస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లో కొంత నిర్లక్ష్య వైఖరిని కూడా గమనించాం. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో కొనే వారు, అమ్మే వారు ఇద్దరూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. మాస్కులు ధరించిన వారు సైతం సరైన పద్ధతిలో ధరించడం లేదు. జనం రద్దీ ఉన్న చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని డా.శ్రీనివాస్‌ తెలిపారు.

‘రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ తరఫున అన్ని రకాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని శ్రీనివాస్​ పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ సూచించిన నియమాలు పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. ఇప్పటివరకు లక్షలాది మంది ప్రజలు కొవిడ్ బారిన పడకుండా కాపాడుకుంటూ వచ్చామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెకెండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ అని మరోసారి కరోనా విజృంభణ గురించి వింటున్న క్రమంలో... అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనేలా చేతులారా చేసుకోకూడదని సూచించారు. దీపావళి పండగను దీపాలతో జరుపుకొందామన్న శ్రీనివాస్​... కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బాణసంచాకు దూరంగా ఉందామని సూచించారు.

ఇదీ చూడండి:టపాసుల నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

Last Updated : Nov 13, 2020, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details