తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Corona Cases Today : 'కరోనా పాజిటివ్' తేలినా యథేచ్ఛగా తిరుగుతున్నారు! - తెలంగాణలో కరోనా కేసులు

Telangana Corona Cases Today : రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ నెమ్మదిగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన రాష్ట్ర వైద్యశాఖ అలసత్వం ప్రదర్శిస్తోందనే విమర్శలున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చి కరోనా బారిన పడిన వారి కదలికలపై నిఘా వేయడంలో విఫలమైందనే ఆరోపణలొస్తున్నాయి.

Telangana Corona Cases Today
Telangana Corona Cases Today

By

Published : Dec 17, 2021, 7:31 AM IST

Telangana Corona Cases Today : అంతర్జాతీయ ప్రయాణికుల్లో పాజిటివ్‌ వచ్చిన వారి కదలికలపై నిఘా వేయడంలో వైద్యఆరోగ్యశాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణయిన సోమాలియాకు చెందిన వ్యక్తి రెండు రోజులపాటు యథేచ్ఛగా నగరంలో ఆస్పత్రుల చుట్టూ తిరగడమే దానికి నిదర్శనం. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత 14 రోజులపాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండగా, ఆ నిబంధనలను ఎక్కువమంది పాటించడం లేదు. ఇతని విషయంలోనూ అదే జరిగిందని, వైద్యసిబ్బంది అలసత్వంగా వ్యవహరిస్తుండటమే దానికి కారణమనే ఆరోపణలున్నాయి

Omicron Variant Telangana : నిజానికి అంతర్జాతీయ ప్రయాణికుల్లో పాజిటివ్‌లుగా నిర్ధారణయిన వారి సంఖ్య స్వల్పంగానే ఉంటోంది. ఆ కొద్దిమందిపైనా నిఘా వేయకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఉదాహరణకు ముప్పులేని దేశం నుంచి వచ్చిన మరో వ్యక్తికి 12వ తేదీన హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ర్యాండమ్‌ ఆర్టీపీసీఆర్‌ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. 14వ తేదీన జన్యుక్రమ విశ్లేషణలో ఒమిక్రాన్‌ నిర్ధారణయింది. 15వ తేదీ మధ్యాహ్నం వరకు అతని ఆచూకీని అధికారులు తెలుసుకోలేకపోయారు. 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అతనిపై ఎందుకు నిఘా వేయలేకపోయారు? అతని కదలికలను ఎందుకు నియంత్రించలేకపోయారనేది ప్రశ్నార్థకమే. ఈ కాలంలో ఆ వ్యక్తి ద్వారా ఎంతమందికి ఒమిక్రాన్‌ సోకి ఉంటుందోననే ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇలా అతనొక్కడే కాదు.. పలువురు అంతర్జాతీయ ప్రయాణికులు పాజిటివ్‌ నిర్ధారణయినప్పటికీ ఐసొలేషన్‌లో ఉండడం లేదనే అనుమానాలు న్నాయి. ముప్పున్న దేశాల నుంచి వచ్చి నెగిటివ్‌గా తేలినన వారు కూడా హోం ఐసోలేషన్‌లో ఉండేలా చూడాలి. ఎనిమిది రోజుల తర్వాత మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయాలి. అదీ సక్రమంగా జరగడం లేదు.

వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసులు

Omicron Cases in Telangana Today : హైదరాబాద్‌కు గల్ఫ్‌ దేశాల నుంచి ఎక్కువగా విమానాలు వస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని దేశాలతోపాటు వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులు హైదరాబాద్‌కు గల్ఫ్‌ దేశాలైన దుబాయ్‌, అబుదాబి, షార్జా మీదుగా వస్తుంటారు. ఇలా చేరేందుకు కనీసం మూడు రోజుల సమయం పడుతోంది. ప్రయాణానికి ముందు మూడు రోజులు..ప్రయాణ సమయం మూడు రోజులు కలిపి ఆరు రోజులవుతోంది. ఈ సమయంలో కొందరు వైరస్‌ బారిన పడుతున్నారని, అందుకే శంషాబాద్‌లో చేసే పరీక్షల్లో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ సీనియర్‌ రీజినల్‌ డైరెక్టర్‌ మేడోజు అనూరాధ వివరించారు.

రెండు శాతం మందికే పరీక్షలా?

Corona Cases in Telangana : శంషాబాద్‌కు మాల్దీవులు, కౌలాలంపూర్‌, కొలంబో, సింగపూర్‌, బ్రిటన్‌తోపాటు షార్జా, అబుదాబీ, దోహా, దుబాయ్‌, బహ్రెయిన్‌, మస్కట్‌, కువైట్‌ నుంచి విమానాలు నడుస్తున్నాయి. వీటిల్లో బ్రిటన్‌, సింగపూర్‌ మాత్రమే ముప్పు ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల నుంచి రోజుకు ఒకటి లేదా రెండు విమానాలు వస్తున్నాయి. వాటిల్లో వచ్చే ప్రయాణికులందరికీ ఆర్టీపీసీఆర్‌ చేస్తున్నారు. ముప్పు లేని దేశాల నుంచే శంషాబాద్‌కు అత్యధిక మంది ప్రయాణికులు వస్తున్నారు. వీరికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడంతోపాటు ర్యాండమ్‌గా 2 శాతం మంది ప్రయాణికులను ఎంచుకుని ఆర్టీపీసీఆర్‌ చేస్తున్నారు. ఎక్కువ మంది పరీక్షలు చేయకపోవడంతో పాజిటివ్‌ కేసులు గుర్తించడం కష్టతరంగా మారుతోంది. ఇలాంటి వారి వల్ల కూడా ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనను నిపుణులు వ్యక్తపరుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details