corona positive patient escape: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా కంటే ఒమిక్రాన్ 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని తేల్చటంతో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారితోనే వైరస్ వ్యాప్తి జరగనున్న క్రమంలో.. ఎయిర్‌పోర్టులోనే కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడే అందరు ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి.. ఒకవేళ పాజిటివ్ వచ్చినా, ఎలాంటి అనుమానం ఉన్నా.. ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స ఇస్తున్నారు.
ఎయిర్పోర్ట్ నుంచి తప్పించుకుని..
corona positive women escape: ఇలాంటి కీలక పరిస్థితుల్లో విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ(36).. అధికారులను ఆగం చేసింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఆమె.. ఐసోలేషన్‌కు వెళ్లకుండా తప్పించుకుని పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ సర్కిల్ గణేశ్‌నగర్ సమీపంలోని రిడ్జ్ టవర్స్‌కు చెందిన ఓ మహిళ(36) విదేశాల్లో ఉంటుంది. బుధవారం రోజు(డిసెంబర్ 1)న తిరిగి నగరానికి వచ్చిన ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ఐసోలేషన్ నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో వారి నుంచి తప్పించుకుంది.
నేరుగా తల్లిదండ్రుల వద్దకు..
escaped corona women caught: అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ పోలీసులు సదరు మహిళ ఆచూకీ కోసం వెతకటం మొదలుపెట్టారు. అప్పటికే చాలా చోట్ల వెతికిన పోలీసులకు ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. ఆ మహిళ.. అక్కడి నుండి తప్పించుకొని ఓ ఆటోలో నేరుగా... రిడ్జ్ టవర్స్‌లో ఉండే తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు పాస్‌పోర్ట్ ఆధారంగా ఆమె చిరునామా గుర్తించారు. సదరు ప్రాంత పోలీస్‌స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించారు.