జీహెచ్ఎంసీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. బల్దియా ఎన్నికల్లో నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న నేతల్లో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో గ్రేటర్‌లో మొత్తంగా 102 మందికి కరోనా నిర్ధారణ అయింది. మేడ్చల్‌లో 47, రంగారెడ్డి జిల్లాలో 46 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
బల్దియా ప్రచారంలో పాల్గొన్న నేతల్లో కొందరికి కరోనా - corona positive to campaign leaders
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతల్లో కొవిడ్ లక్షణాలు బయట పడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు కరోనా నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే చికిత్స తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సిబ్బందికి శనివారం కరోనా పరీక్షలు చేశారు. గత కొన్నిరోజులుగా వీరంతా ఎన్నికల విధుల్లో ఉండటంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు.
‘‘కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా ..వైరస్ ఉండే అవకాశం ఉంది. వీరివల్ల కుటుంబంలోని ఇతర సభ్యులకు సోకే ప్రమాదం ఉంది. వారం పది రోజులపాటు ఎవర్నీ కలవకపోవడం మంచిది. మాస్క్ ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, ఇతర వ్యక్తులకు కనీసం ఆరు అడుగుల దూరం పాటించడం ముఖ్యం’’ అని వైద్యులు సూచించారు.