ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతి చెందగా... మొత్తం మరణాల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 814మంది చికిత్స పొందుతున్నారు.
కృష్ణా జిల్లాలో ఒకేరోజు 25 కేసులు నమోదు కావటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 127కు చేరింది. ఇప్పటివరకూ 29 మంది డిశ్చార్జి కాగా... 90 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఒకరు మరణించటంతో... జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 8కి చేరిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వరుసగా రెండో రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది.
మొత్తం కేసుల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్న కర్నూలు జిల్లాలో ఒకేరోజు 14 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 275కు చేరింది. ఇప్పటికే ఏడుగురు కోలుకుని ఇళ్లకు చేరుకోగా... 259 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఒకరు మరణించటంతో... జిల్లాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
అనంతపురం జిల్లాలో ఒకేరోజు ఐదు పాజిటివ్ కేసులుకాగా... మొత్తం కేసుల సంఖ్య 51కి చేరింది. ఇప్పటివరకూ కోలుకుని 13 మంది డిశ్చార్జి అయ్యారు. 34 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మొత్తం నలుగురు మరణించారు. జిల్లా వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలుచేస్తున్న అధికారులు... రెండురోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో... మరిన్ని చర్యలకు సిద్ధమయ్యారు.
కడప జిల్లాలో నాలుగు కేసులు నమోదు కావటంతో... మొత్తం కేసుల సంఖ్య 55కు పెరిగింది. ఇప్పటివరకూ 28 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 27 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క మృతీ నమోదు కాలేదు.