Corona Effect on TSRTC : ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీపై కరోనా మూడో దశ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒమిక్రాన్ ఎంట్రీతో.. కేసులు పెరగడం మొదలైంది. కేసుల పెరుగుదలతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీపై ఎఫెక్ట్ పడుతోంది. కొవిడ్ మహమ్మారి సోకుతుందనే భయంతో బస్సు ప్రయాణాలు తగ్గిపోయాయి. ఆదరణ లేని ప్రాంతాలకు ట్రిప్పులు తగ్గించినా.. ఉన్న బస్సుల్లో కూడా ప్రయాణికులు అంతంత మాత్రంగానే ప్రయాణిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీపై కొవిడ్-19, ఒమిక్రాన్ ప్రభావం భారీగానే కన్పిస్తోంది. ఒక పక్క పాఠశాలలు, కళాశాలలు మూతపడటం, వర్క్ ఫ్రం హోంలే నడుస్తుండటం వల్ల ఆర్టీసీ బస్సులు వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే కరోనా బారిన పడతామనే భయంతో చాలా మంది ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ట్రిప్పులు తగ్గించినా.. నో యూజ్
Covid Effect on TSRTC : గ్రేటర్ పరిధిలో సుమారు 2,500ల ఆర్టీసీ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. నగర శివారు ప్రాంతంలో ఆర్టీసీ మరో 250 బస్సులను తిప్పుతోంది. ఈ విధంగా సుమారు ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 15,000ల పైచిలుకు ట్రిప్పులు తిరుగుతుంటాయి. కానీ..గ్రేటర్ పరిధిలో తక్కువ మంది ప్రయాణించడంతో సుమారు 2,500ల పైచిలుకు ట్రిప్పులను ఆర్టీసీ తగ్గించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయినా మిగిలిన బస్సులు పూర్తిస్థాయిలో నిండడం లేదని చెబుతున్నారు.
అప్పుడు కళకళ.. ఇప్పుడు వెలవెల..
TSRTC Suffers Loss Due to Corona : సంక్రాంతి పండుగ వరకు గ్రేటర్లోని ఆర్టీసీ బస్సులు కళకళలాడాయి. గత వారం రోజులుగా ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయిందని డ్రైవర్లు, కండక్టర్లు అంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సిటీ బస్సులు సగానికి పైగా ఖాళీగా ఉంటున్నాయని చెబుతున్నారు. రోజురోజుకు కొవిడ్ కేసులు భారీగా నమోదవుతుండం వల్ల జనం స్వీయనియంత్రణ పాటిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. అత్యవసరాల్లోనే ప్రజలు బయటకు వస్తుండటం.. చాలా తక్కువగా ప్రజారవాణాను వినియోగిస్తుండటం వల్ల బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు.
నో లాస్.. నో ప్రాఫిట్
TSRTC Suffers Loss Due to Covid-19 : సంక్రాంతికి ముందు వరకు ప్రయాణికుల ఆక్యుపెన్సీ 65 శాతం వరకు ఉండేదని.. ప్రస్తుతం 45 శాతం వరకు తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని రూట్లలో డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదని, ట్రిప్పులను రద్దు చేసుకోవాల్సి వస్తోందని డ్రైవర్లు, కండక్టర్లు పేర్కొంటున్నారు. కొన్ని నైట్ హాల్ట్ బస్సుల్లో సంక్రాంతి వరకు రోజుకు 12,000 రూపాయల వరకు ఆదాయం వస్తే.. ప్రస్తుతం అది రూ.7,000 కూడా రావడం లేదని చెబుతున్నారు. విద్యాసంస్థల పునఃప్రారంభం, వర్క్ ఫ్రం హోం తొలగించి.. ఉద్యోగులను కార్యాలయాలకు పిలిస్తే.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో.. 'నో లాస్.. నో ప్రాఫిట్' కొనసాగుతుందని అంటున్నారు. కాకపోతే ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం మరోసారి ఆర్టీసీ నష్టాలు మూటగట్టుకునే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!