కరోనా ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ప్రజలెవరూ ప్రజారవాణా వినియోగించకపోవడం వల్ల చాలావరకు రైళ్లు, బస్సులను అధికారులు రద్దు చేస్తున్నారు. ద.మ.రైల్వే పరిధిలో 23 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. పాక్షికంగా హెచ్.ఎస్.నాందేడ్ -తాండూర్, తాండూర్-హెచ్.ఎస్ నాందేడ్, ఔరంగాబాద్ -హెచ్.ఎస్.నాందేడ్, ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్, వికారాబాద్ -గుంటూరు, సికింద్రాబాద్-యశ్వంత్ పూర్, తిరుపతి-మన్నర్ గుడి, రేపల్లే-కాచిగూడ, గుంటూరు -కాచిగూడ, సికింద్రాబాద్-సాయినగర్ షిర్డి, తిరుపతి-చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్-విశాఖపట్టణం, ఔరంగాబాద్ -రేణిగుంట, పర్బనీ -హెచ్.ఎస్ నాందేడ్ రూట్లలో ఈనెల 31 వరకు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఆర్టీసీపైనా కరోనా ప్రభావం
ఆర్టీసీపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపెడుతోంది. సిటీ బస్సుల్లో, జిల్లాలకు వెళ్లే బస్సుల్లో ప్రజలు పెద్దగా ప్రయాణించడం లేదు. చాలా ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు లేకపోవడంతో రద్దవుతున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్టీసీలో సుమారు 25నుంచి 30శాతం బస్సులు రద్దయినట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నా ప్రయాణికులు లేకపోవడం వల్ల రద్దు చేయక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు.
వాటికీ గిరాకీ లేదు
ఆటోలు, క్యాబ్‌లలో కూడా పెద్దగా ప్రజలు ప్రయాణించడం లేదు. రాత్రి ఎలాగూ కర్ఫ్యూ ఉంటుంది. భాగ్యనగరంలో 2.20 లక్షల వరకు ఆటోలు, సుమారు 80వేల వరకు క్యాబ్‌లు ఉన్నాయి. రాత్రి కర్య్ఫూ వల్ల, రెండో దశ కరోనా ఉద్ధృతి వల్ల ప్రస్తుతం వీటికి కూడా గిరాకీ లేకుండా పోయింది.