ఏటా హైదరాబాద్‌లోని పాతబస్తీ రాఖీ అమ్మకాల కోసం ముస్తాబవుతుంది. నవంబర్ నెల నుంచే ఇక్కడ రాఖీలు తయారు చేస్తుంటారు. అయితే రకరకాల అందమైన రాఖీలు తయారైనప్పటికీ... వాటిని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రవాణా సౌకర్యాలు లేవని వ్యాపారస్థులు అంటున్నారు. ఎప్పుడూ నేరుగా క్రయ విక్రయాలు జరిపే వ్యాపారులు... కొవిడ్ కారణంగా ఇప్పుడు ఆన్‌లైన్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. హోల్‌సేల్‌గా రాఖీ అమ్మకాలు జరిపే షాపులు... ఇప్పుడు వెలవెలబోతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలోనే... రాఖీ పండుగ ఉన్నప్పటికీ రిటేల్ కొనుగోలుదారులు లేక బోసిపోతున్నాయి.
రాఖీ హోల్‌సేల్ అమ్మకందారులు శానిటైజర్‌లను దుకాణాల్లో ఉంచడంతోపాటు... మాస్క్‌లు ధరించిన వారికే విక్రయిస్తామంటున్నారు. రాఖీ పండుగ ఎవరి ఇంట్లో వారే జరుపుకునే పండుగ అయినప్పటికీ... అన్న ఇంటికి చెల్లి... చెల్లి ఇంటికి అన్న వెళ్లాలంటే... కరోనా మహమ్మారి అడ్డుగా నిలిచిందని వ్యాపారస్థులు వాపోతున్నారు. సొంత వాహనాలు ఉన్న వారు మాత్రమే... కొనుగోలు చేసేందుకు వస్తున్నారని చెబుతున్నారు.