మహమ్మారి కరోనా చిలుక జ్యోతిషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని ఈ బడుగు జీవులు వైరస్ కారణంగా నిశ్చేష్టులైపోతున్నారు. జోస్యం చెప్పనిదే పూట గడవని వీరి బతుకులు కొవిడ్ కల్లోలంలో కొట్టుమిట్టాడుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రధానంగా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఇందిరాపార్క్, సచివాలయం పరిసర ప్రాంతాలతో పాటు... నగరంలోని పలు ప్రాంతాల్లో చిలుక జ్యోతిష్కులు సంచరిస్తుంటారు. గుజరాత్‌లోని సూరత్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఈ బడుగులు... బతుకు బండి నడిచేందుకు రోజూ చిలుకను పట్టుకుని వీధుల్లోకి వెళుతుంటారు. రోడ్ల వెంబడి వెళ్లే వారికి జోస్యం చెబుతూ జీవనం సాగిస్తుంటారు.
ముందుకు రావడంలేదు..
సాధారణంగా చిన్న పిల్లలు, యుక్త వయస్సు వారు ఎక్కువగా చిలుక జోస్యం చెప్పించుకుంటుంటారు. ఇటీవలి కాలంలో వీటికి ఆదరణ తగ్గినప్పటికీ... వేరే జీవనాధారం లేక ఇదే వృత్తిని నమ్ముకుని బతుకీడుస్తున్నారు. కరోనాతో పరిస్థితులు తలకిందులైపోవడంతో ఇప్పుడు పూర్తిగా జాతకం చూపించుకునే వాళ్లే కరవైపోయారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శానిటైజర్లు, మాస్క్‌లు ధరించి, డిజిటల్ పేమెంట్‌లు పెట్టుకున్నప్పటికీ... జోస్యం చెప్పించుకునే వారు మాత్రం ముందుకు రావడంలేదని ఆందోళన చెందుతున్నారు.