తెలంగాణ

telangana

ETV Bharat / city

మూసివేత దిశగా వ్యవసాయ మార్కెట్​ యార్డులు! - corona virus latest news

కరోనా భయం వ్యవసాయ రంగాన్ని తాకింది. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులపై కరోనా దెబ్బపడింది. ఈ ఏడాది రబీ సీజన్​లో ... రైతులు అధికంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు మార్కెట్​కు తీసుకొస్తుంటారు. అప్రమత్తంగా లేకపోతే ఆరోగ్యపరంగా ముప్పు తప్పదంటూ మార్కెటింగ్ శాఖ అన్నదాతల్ని హెచ్చరించింది. అవసరమైతే యార్డులు మూసివేసేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Corona Effect on market yards
మూసివేత దిశగా వ్యవసాయ మార్కెట్​ యార్డులు!

By

Published : Mar 19, 2020, 5:25 AM IST

Updated : Mar 19, 2020, 8:53 AM IST

రాష్ట్రంలో కరోనా ప్రభావం వ్యవసాయ మార్కెట్లపైనా పడింది. పంటలు కొనలేం అని వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు మార్కెట్లకు సెలవు ఇవ్వాలా వద్దా అనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే... నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పసుపు అమ్మకాలకు ఈ నెల 21 నుంచి విరామం ప్రకటించిన నేపథ్యంలో మిగతా ప్రాంతాలపైనా దృష్టి సారించారు. ప్రతి మార్కెట్‌కు వచ్చే రైతులకు కరోనా వ్యాప్తిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మిరప ఘాటుకు తుమ్ములు..

రాష్ట్రంలో అతి పెద్దదైన వరంగల్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున పత్తి, మిరప పంటను కర్షకులు తెస్తున్నారు. పంటతో వచ్చిన ప్రతి రైతుకు మార్కెటింగ్ శాఖ సిబ్బంది మాస్క్‌లను పంపిణీ చేస్తున్నారు. మిరప మార్కెట్‌లో ఘాటు కారణంగా విపరీతంగా తుమ్ములు, దగ్గులు రావడం సహజం. జలుబు సోకిన రైతులు ఎవరైనా మార్కెట్‌కి వస్తే.. ఇతరులకు అది వేగంగా వ్యాపిస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెటింగ్​ శాఖ అప్రమత్తం..

హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూరగాయలు కొనడానికి వెళ్తుంటారు. వినియోగదారులకు కరోనాపై అవగాహన కల్పించేందుకు బ్యానర్లు, ఫ్లెక్సీలపై సూచనలు ముద్రించి.. అవగాహన కల్పిస్తున్నారు. సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని మార్కెటింగ్ శాఖ సూచించింది. రైతులు పెద్ద ఎత్తున గుమిగూడి ఉండకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం పంటలు అధికంగా మార్కెట్లకు వచ్చే సీజన్ కాబట్టి... ఒకేసారి సెలవులు ప్రకటిస్తే పంటలు అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడతారని అధికారులు భావిస్తున్నారు.

ధరలు పతనమయ్యే అవకాశం..

కరోనా ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు తగ్గిపోతున్నాయి. పంటల ధరలు మరింత పతనమయ్యే పరిస్థితి ఏర్పడితే మార్కెట్లకు కొంత కాలం విరామం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు ధర పడిపోతున్నందున నిజామాబాద్‌ మార్కెట్‌లో కొనుగోళ్లు ఆపేస్తామని వ్యాపారులే వినతి పత్రం ఇచ్చారు.

రికార్డు స్థాయిలో మిర్చి ధర..

బుధవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు మిరప పంట పోటెత్తింది. మిరప ధర రికార్డు స్థాయి రేటు పలికింది. క్వింటా మిర్చి రూ. 26 వేల రూపాయలకు చేరింది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యధికమని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషించాయి. ఈ సమయంలోనే పంట అమ్ముకునేందుకు రైతులు మార్కెట్లుకు వస్తుంటారు. ఇది కరోనా వ్యాప్తికి దారితీస్తుందేమోనన్న ఆందోళన కూడా యార్డుల యాజమాన్యాల నుంచి వ్యక్తమవుతోంది.

ఇవీ చూడండి:'పండగలు మళ్లీ వస్తాయి.. భక్తి గుండెల్లో ఉంటుంది'

Last Updated : Mar 19, 2020, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details