తెలంగాణ

telangana

ETV Bharat / city

పిల్లలపై కరోనా ప్రభావం తక్కువే.. - coronavirus symptoms

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి చిన్నారులను రక్షించుకోవడంలో అప్రమత్తతే శ్రీరామరక్షగా నిలుస్తుందని ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ పి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇతర వయస్కులతో పోలిస్తే పదేళ్లలోపు పిల్లల్లో కరోనా వైరస్‌ ప్రభావం తక్కువగా కనిపిస్తున్నట్లు చైనా, ఇటలీ, ఇతర పాశ్చాత్య దేశాల గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోందన్నారు. మన దగ్గర పరిస్థితులపై స్పష్టత లేని నేపథ్యంలో పిల్లల విషయంలో ఏమరుపాటుగా ఉండడం తగదని ఆయన సూచించారు. వైరస్‌ ప్రభావం వల్ల పిల్లల్లో కొన్ని లక్షణాలు అదనంగా కనిపించే అవకాశాలున్నాయని, వీటిని గుర్తించి సత్వర చికిత్సకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ పి.సుదర్శన్‌రెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడారు.

Corona effect on children
Corona effect on children

By

Published : Apr 5, 2020, 9:47 AM IST

పిల్లలపై కరోనా ప్రభావం తీవ్రంగా లేదని అంటున్నారు.. ఇందులో వాస్తవమెంత?

సాధారణంగా చిన్న పిల్లలకు ఐదు సంవత్సరాలు నిండే వరకూ రక్షణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. వారిలో అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. అవి త్వరగా ప్రభావం చూపించి, ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. కానీ కరోనా వైరస్‌ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. కొవిడ్‌ 19 బారినపడిన వారిలో యువకులు, మధ్యవయస్కులు, వృద్ధులు ఎక్కువ ఉన్నారు. పిల్లల్లో 2-4 శాతం మందిలో మాత్రమే వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇదొక ప్రత్యేకతగా అనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక అంచనానే. పిల్లల విషయంలో నిర్లక్ష్యం అనేది పనికి రాదు. ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి.

కరోనా వైరస్‌ సోకిన పిల్లల్లో ప్రత్యేకంగా కనిపించే లక్షణాలు?

పెద్దవారిలో అయితే దగ్గు, జ్వరమూ, ఆయాసం ఈ మూడు ప్రధానంగా కనిపిస్తాయి. కొంచెం గొంతునొప్పి ఉంటే ఉండొచ్చు. అదే పిల్లల్లో అయితే బహుళ అవయవ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. శ్వాసకోశ లక్షణాలే కాకుండా విరేచనాలు, వాంతులు వంటి జీర్ణకోశ లక్షణాలు కూడా ఉంటాయి. నీరసం, అచేతనం వంటి పరిణామాలు కనిపిస్తాయి. పొడి దగ్గు ఉంటుంది. గొంతులో గరగర ఉంటుంది. శ్వాసనాళాల్లో అసౌకర్యంగా ఉంటుంది. తెమడ ఉండదు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జన సంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు పిల్లలను తీసుకుపోవద్దు. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇంట్లోనే వండి వేడి వేడిగా పిల్లలకు వడ్డించండి. చల్లని పదార్థాలు పెట్టకండి. చల్లని పదార్థాల్లో కరోనా వైరస్‌ ఎక్కువ రోజులు ఉంటుంది. గొంతు పొడిగా ఉంటే, కరోనా వైరస్‌ వీరవిహారం చేస్తుంది. అదే తరచూ నీళ్లు తాగుతూ గొంతును తడిగా ఉంచుకుంటే వైరస్‌ లోపలకు వెళ్లడానికి అవకాశాలు తక్కువ. నీళ్లు తాగినప్పుడు గొంతులో ఉన్న వైరస్‌ కడుపులోకి వెళ్తుంది. కడుపులోని ఆమ్లాలు ఆ వైరస్‌ను చంపేస్తాయి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో చిటికెడు పసుపు వేసి తాగించాలి. ఇది పిల్లలకే కాదు.. పెద్దలకూ మేలు చేస్తుంది. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినిపించాలి.

వైరస్‌ ప్రభావం ఎలా ఉంటుంది?

కరోనా వైరస్‌ ప్రభావితమైన మనుషుల్లో ఆ వైరస్‌ నుంచి కాపాడుకోవడానికి శరీరం కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని ‘సైటోకైన్స్‌’ అంటారు. ఇవి కూడా ఒక రకమైన రక్షణ దళమే. సగం వైరస్‌ కారణంగా నష్టం జరిగితే, మిగతా సగం మన శరీరం విడుదల చేసే సైటోకైన్స్‌ వల్ల సంభవిస్తుంది. ఇదొక సూసైడ్‌ బాంబ్‌ లాంటిది. వైరస్‌తో ఈ సైటోకైన్స్‌ జరిపే పోరాటంలో సాధారణ కణజాలం కూడా దెబ్బతింటుంది. సైట్‌కైన్స్‌ ఎవరిలో ఎక్కువ విడుదలవుతాయో వారిలో అంతర్గత కణజాలం కూడా అంత ఎక్కువ దెబ్బతింటుంది. చిత్రంగా చిన్నపిల్లల్లో ఈ సైటోకైన్స్‌ స్పందన తక్కువగా ఉంది. మామూలుగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినప్పుడు చిన్నారుల శరీరాల్లో ఎంత మేరకైతే సైటోకైన్స్‌ విడుదలవుతాయో, ఆ రీతిలో కరోనా వైరస్‌ ప్రవేశించినప్పుడు అవి విడుదల కావడం లేదు.

స్వీయ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉంటేఎలా?

ఆ వ్యక్తికి దూరంగా పిల్లలను వేరే గదిలో ఉంచాలి. పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించాలి. వైరస్‌ ప్రభావం గరిష్ఠంగా 14 రోజులు ఉంటుంది. అవసరమైన చికిత్స చేయిస్తే పూర్తిగా కోలుకునే అవకాశాలెక్కువ. ఆందోళనకు గురికాకుండా తగిన శ్రద్ధ చూపాలి.

ఇదీ చూడండి:కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!

ABOUT THE AUTHOR

...view details