ముస్లింల పండుగల్లో బక్రీద్ ప్రధానమైనది. త్యాగానికి ప్రతీకైన ఈ పండుగ రోజున ముస్లింలు తప్పనిసరిగా మేకలను బలిస్తారు. ఈ నేపథ్యంలో గొర్రె, మేక పొట్టేళ్లకు చాలా గిరాకీ ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భన్నింగా తయారైంది. లాక్‌డౌన్ ఆంక్షలతో ఇతర రాష్ట్రాల నుంచి జీవాలు రాకపోవడం వల్ల భాగ్యనగరంలో ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. కొనుగోళ్లు పడిపోవడం వల్ల పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాపారులు, రైతులు వాపోతున్నారు. ఈ సారి జియాగూడ, చెంగిచెర్ల, ఇతర మాంసం మార్కెట్లు బోసిపాయాయి.
అంతా తారుమారైంది
అనంత, అపార కరుణా ప్రధాత అల్లాహ్ పేరిట... ప్రవక్త కాలంలో ఒక వ్యక్తి తన కుటుంబం తరఫున ఒక గొర్రె, మేకను కుర్బానీ ఇచ్చేవారు. గొర్రె, మేక కుర్బానీ ఇచ్చే స్థోమత లేని కుటుంబాలు... ఏడుగురు కలిసి ఒక ఆవును, పది మంది కలిసి ఒక ఒంటెను ఇవ్వవచ్చు. కొమ్ములు గల జంతువు, కాళ్లు, ఉదరం నల్లగా ఉన్న పొట్టేలు, కళ్లు నల్లగా, బలిష్టమైన, ఖరీదైన జంతువులను కుర్బానీ ఇవ్వడం అభిలషణీయం. అందుకనుగుణంగా బక్రీద్‌కు వారం రోజుల ముందే వివిధ రాష్ట్రాల నుంచి జీవాలు పెద్ద ఎత్తున నగరానికి దిగుమతయ్యేవి. కానీ గత మూడేళ్ల కాలంలో ఈసారి పరిస్థితి దయనీయంగా మారిందంటున్నారు వ్యాపారులు.
నిలిచిన రవాణా
ఏటా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జీవాలు హైదరాబాద్‌కు తీసుకొచ్చేవారు. ఎంత వ్యయమైనా వెచ్చించి స్థానిక వ్యాపారులు దందా చేయడం ఆనవాయితీ. కరోనా వైరస్ కట్టడి, లాక్‌డౌన్ ఆంక్షలతో... ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలపై నిషేధం ఉండటం వల్ల జీవాల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా వర్తకులు, రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. జంట నగరాల్లో ఉన్న వ్యాపారులంతా చిన్న, సన్నకారు వర్తకులే కావడం వల్ల ప్రస్తుతం పలికే ధరలు గిట్టుబాటు కావడం లేదు. కిలో మాంసం రూ. 700 రూపాయలకు కూడా అమ్ముడుపోవడం లేదు. అంతేకాకుండా కుర్బానీ 50 శాతం కూడా మించడం లేదు. 20 కిలోల మేక 17 నుంచి 18 వేల రూపాయల ధర పలుకుతుండటం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోందని వ్యాపారులు, వినియోగదారులు వాపోతున్నారు.