కరోనా రెండో దశ వేగంగా విజృంభిస్తోంది. బాధితుల్లో చిన్నారులు, యువత సంఖ్య పెరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల మేరకు రాష్ట్రంలో ఈ నెలలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 56.4 శాతం మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇప్పటివరకు 43.2 శాతం కేసులు 21-40 ఏళ్ల యువతలో నిర్ధారణ అయ్యాయి. విద్య, ఉపాధి అవసరాలకు బయటకు రావడంతో మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
తొలి దశ సమయంలో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన యువత శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ఒక్కరికి వైరస్ సోకితే మిగతా కుటుంబ సభ్యులకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇంట్లో చిన్నారులు, కుటుంబసభ్యులు కరోనా బారినపడుతున్నారు. 0-10 ఏళ్లలోపు బాధితులు 2.7 శాతం మంది ఉండగా.. 11-20 ఏళ్లలోపు వారు 10.5 శాతం ఉండటం గమనార్హం. కొన్ని సందర్భాల్లో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి చికిత్స తీసుకుంటున్నవారు 14 శాతం వరకు ఉంటారని అంచనా. బుధవారం నాటికి మొత్తం 49,781 మంది బాధితులు ఆస్పత్రుల్లో, ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కొందరు యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భౌతిక దూరం, మాస్కులు, ఇతర కరోనా నిబంధనలు పాటించకపోవడంతో మహమ్మారి బారిన పడటంతో పాటు ఇతరులకు వ్యాప్తిలో వాహకాలుగా (స్పైడర్లుగా) మారుతున్నారు.