తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్​టీ లాంప్ విధానంతో అరగంటలో కరోనా నిర్ధరణ పరీక్ష - corona diagnostic test cost 300 rupees

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అరగంటలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించే విధానాన్ని హైదరాబాద్​ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆర్​టీ లాంప్ అనే నూతన పరీక్షా విధానాన్ని ఆవిష్కరించారు.

corona diagnostic test in an half an hour with rt lamp procedure
ఆర్​టీ లాంప్ విధానంతో అరగంటలో కరోనా నిర్ధరణ పరీక్ష

By

Published : Jun 11, 2020, 6:45 AM IST

అత్యంత వేగంగా, కచ్చితత్వంతో, అతి తక్కువ ఖర్చుతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే విధానాన్ని హైదరాబాద్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్టేజ్‌- లూప్‌ మీడియేటెడ్‌ ఐసోథర్మల్‌ ఆంప్లిఫికేషన్‌(ఆర్‌టీ-లాంప్‌)’ అనే పరీక్ష విధానాన్ని ఆవిష్కరించారు.

ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ వైద్య కళాశాల, హైదరాబాద్‌లోని టాటా పరిశోధన సంస్థ సహకారంతో ఈ పరీక్షను అందుబాటులోకి తెచ్చినట్లు నిమ్స్‌ వైరాలజీ పరిశోధన, అభివృద్ధి విభాగం అధిపతి డాక్టర్‌ కె.మధుమోహన్‌రావు తెలిపారు. ‘‘ప్రస్తుతం కొవిడ్‌ నిర్ధారణకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఇందులో ఫలితం రావడానికి 12-24 గంటలు పడుతుంది. అధునాతన ప్రయోగశాల అవసరం. రూ.4,500 ఖర్చవుతుంది.

ఆర్‌టీ-లాంప్‌ విధానంలో అరగంటలోనే ఫలితం తెలుస్తుంది. రూ.300 మాత్రమే వ్యయమవుతుంది. ఈ పరీక్షను సాధారణ వసతులున్న అన్ని ప్రయోగశాలల్లో కొన్ని జాగ్రత్తలతో నిర్వహించవచ్చు’’ అని మధుమోహన్‌రావు వివరించారు. భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) నుంచి అనుమతి రాగానే ఈ విధానంలో పరీక్షలు ప్రారంభిస్తామన్నారు.

పరీక్ష విధానం

ఈ విధానంలో గులాబీ రంగులో ఉండే ఒక ప్రత్యేక రసాయనాన్ని(రీయేజెంట్‌) పరీక్ష నాళికలో(టెస్ట్‌ ట్యూబ్‌) పోస్తారు. కరోనా అనుమానిత వ్యక్తుల నుంచి శ్లేష్మం(స్వాబ్‌) సేకరించి ఆ పరీక్ష నాళికలో వేసి, 60 డిగ్రీల వేడి నీటి ఛాంబర్‌లో 30 నిమిషాల పాటు ఉంచుతారు. శ్లేష్మంలో కరోనా వైరస్‌ ఉంటే పరీక్ష నాళికలోని రసాయనం పసుపు రంగులోకి మారుతుంది. లేకుంటే గులాబీ రంగులోనే ఉంటుంది.

సాధారణ పీసీఆర్‌పై పరీక్షలు

కరోనా నిర్ధారణ పరీక్షలను సులభతరం చేసే ప్రక్రియను సీసీఎంబీ అభివృద్ధి చేసింది. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో పరీక్షల వ్యయం సగం తగ్గడమే కాకుండా ఫలితాల కచ్చితత్వం మెరుగైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు రియల్‌టైమ్‌ క్వాంటిటేటివ్‌ రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిన్షన్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-క్యూపీసీఆర్‌) యంత్రాలపై చేస్తున్నారు. ఈ యంత్రాలు ఖరీదైనవే కాకుండా కొద్దిసంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి.

పరీక్షలకు ఉపయోగించే ప్రోబ్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. వీటి సాయంతో ఆర్‌టీ-క్యూపీసీఆర్‌పై వైరస్‌ను పరీక్షించి కరోనాను నిర్ధారిస్తారు. ప్రోబ్స్‌ వినియోగంతో ఖర్చు అధికమవుతోంది. సీసీఎంబీ తాజా ప్రయోగంలో ప్రోబ్స్‌ అవసరం లేకుండానే పీసీఆర్‌పై పరీక్షించే ప్రత్యామ్నాయ ప్రక్రియను విజయవంతంగా అభివృద్ధి చేసింది. దీన్ని నెస్టెడ్‌ పీసీఆర్‌గా పిలుస్తున్నారు. ఈ పరీక్ష కిట్లు డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రక్రియను భారతీయ వైద్య పరిశోధన మండలి ధ్రువీకరించాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details