తెలంగాణ

telangana

ETV Bharat / city

delta plus: అప్రమత్తత అవసరం.. జాగ్రత్తలు మరవడంతో వైరస్‌ విస్తరణ - delta plus variant cases in telangana

దేశవ్యాప్తంగా డెల్టాప్లస్ కరోనా వైరస్ వేరియంట్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణలో రెండు కేసులు నమోదైన నేపథ్యంలో.. మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ మరింత ప్రమాదకారి కావడం వల్ల మహమ్మారిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

డెల్టాప్లస్​తో అప్రమత్తత అవసరం
డెల్టాప్లస్​తో అప్రమత్తత అవసరం

By

Published : Aug 3, 2021, 10:34 AM IST

తెలంగాణలో డెల్టాప్లస్‌ వైరస్‌ కేసులు బయటపడిన నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరమనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా డెల్టాప్లస్‌ కరోనా వైరస్‌ వేరియంట్‌పై పార్లమెంట్‌లో వైద్య మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మన వద్ద రెండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ వైరస్‌ ప్రమాదకారి కావడంతో మళ్లీ పరీక్షలతోపాటు ఎక్కడికక్కడ వైరస్‌ను కట్టడి చేయడంతోపాటు ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌లో కొన్ని బస్తీలు, కాలనీల్లో కరోనా వైరస్‌ క్రమేపీ విస్తరిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు కూడా అదే తేటతెల్లం చేస్తున్నాయి. కొన్నిచోట్ల పాజిటివ్‌ రేటు పది శాతంపైనే ఉంటోంది.

ఇటీవల వరుస పండుగల నేపథ్యంలో కరోనా లక్షణాలతో చాలామంది టెస్టుల కోసం వస్తున్నారు. ఆగస్టులో వరుస పండుగలు, పెద్దఎత్తున పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు రానున్నాయి. ప్రజలంతా ఒకేచోట గుమిగూడే పరిస్థితి ఉంది. మున్ముందు వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం చింతల్‌బస్తీ, కుమ్మరవాడి, వినాయకనగర్‌, మొట్టుగూడ, తుకారాంగేట్‌, అడ్డగుట్ట, రసుల్‌పురా, బోయినపల్లి, తిరుమలగిరి, పికెట్‌, బార్కస్‌, అలియాబాద్‌, బాగ్‌అంబర్‌పేట, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, హర్రాస్‌పెంట తదితర ప్రాంతాల్లో పరీక్షల్లో పది శాతం పైనే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. 95 శాతం మంది హోంఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు. మిగిలిన 5 శాతం మందిలో 1-2 శాతం మంది ఐసీయూ వరకు వెళుతున్నారు.

గ్రేటర్‌లో నిత్యం 70-100 వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. పండుగల తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు గుంపులకు దూరంగా ఉండాలి. గుంపుల్లో చాలామంది ఫొటోలు, స్వీయ చిత్రాల కోసం మాస్క్‌ తీసేస్తున్నారు. వైరస్‌ శరీరంలోకి చేరేందుకు ఒక్క క్షణం చాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details