రాష్ట్రంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే వైరస్‌కు 33 మంది బలి కాగా... నాలుగు రోజుల వ్యవధిలోనే 105 మంది మహమ్మారి బారిన పడి మృత్యువాతపడ్డారు. ఈ నెలలో రోజూ లక్ష వరకు పరీక్షలు చేస్తుండగా...పాజిటివ్ రేటూ గణనీయంగా పెరుగుతోంది. గత వారంలో 3.52 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు శుక్రవారం నాటికి 7.16 శాతానికి చేరింది. పాటిజివ్‌గా తేలిన బాధితుల్లో నిమిషానికి ఒక్కరికి ఆక్సిజన్ చికిత్స అవసరమవుతుందని గణాంకాల్లో వెల్లడవుతోంది. లక్షణాలు కనిపిస్తన్నా.. సకాలంలో పరీక్షలు చేయక, చికిత్సపరంగా చేస్తున్న నిర్లక్ష్యంతో బాధితుల పరిస్థితి తీవ్రమవుతోంది. వారిలో 30 శాతం మందికి ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సి వస్తోంది. ఆక్సిజన్‌పై చేరికలు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నా...కొందరికి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండడంతో పరిస్థితి తీవ్రమవుతోంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రాణవాయువు కోసం ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సివస్తోంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 18,506 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు సర్కార్ లెక్కల్లో స్పష్టమవుతోంది.
రెండు వారాలుగా కేసులు తీవ్రమవడంతో ఆస్పత్రుల్లో చేరేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకల్లో వెయ్యి మంది ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3,136కి చేరింది. ఐసీయూ పడకలపై 328 ఉండే ప్రస్తుతం 1246కి పెరిగింది. రోగుల అవసరాల దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటులోనూ చికిత్సకు మరిన్ని దవాఖానాలకు అనుమతిస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగునకు చర్యలు చేపట్టింది. ఫలితంగా ఆక్సిజన్ పడకలు అదనంగా 4 వేలు, ఐసీయూ పడకలు మరో 3 వేలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.