రాష్ట్రంలో కొవిడ్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో మార్చిలో తొలి మరణం సంభవించింది. జూన్ నాటికి 260 మంది మృతిచెందారు. ఆ నాలుగు నెలల్లో చనిపోయిన వారి కంటే ఎక్కువమంది ఒక్క జులైలోనే చనిపోయారు. ఆగస్టులో కరోనా మరణాల సంఖ్య మరింతగా పెరిగింది. ఆ నెలలో రోజుకు సగటున 9.87 మంది చొప్పున మృతిచెందారు. సెప్టెంబరులోనూ (రోజుకు సగటున 9.96) అదే ఒరవడి కొనసాగింది. అక్టోబరు నుంచి ఇప్పటివరకూ రెండున్నర నెలల్లో మహమ్మారితో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నవంబరులో సగటున రోజుకు నలుగురి చొప్పున మృతిచెందగా.. ఈ నెలలో గత 15 రోజుల్లో సగటున రోజుకు మూడు కంటే తక్కువ(2.73) సంఖ్యలో మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో కొవిడ్ మరణాలు మంగళవారం నాటికి 0.53 శాతంగా నమోదు కాగా.. ఈ విషయంలో జాతీయ సగటు 1.5 శాతం ఉంది.
గత రెండున్నర నెలల్లో తగ్గిన కొవిడ్ మరణాలు - corona deaths decreased gradually in telangana
తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అక్టోబరు నుంచి ఇప్పటివరకూ రెండున్నర నెలల్లో మహమ్మారితో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో కొవిడ్ మరణాలు మంగళవారం నాటికి 0.53 శాతంగా నమోదు కాగా.. ఈ విషయంలో జాతీయ సగటు 1.5 శాతం ఉంది.
రాష్ట్రంలో కొత్తగా 536 మంది కొవిడ్ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 2,79,135కు పెరిగింది. తాజాగా 622 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 2,70,450 (96.88 శాతం)కి చేరుకుంది. ఈ నెల 15న(మంగళవారం) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. కొవిడ్‌తో తాజాగా ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1502కు పెరిగింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 52,057 నమూనాలను పరీక్షించగా, మొత్తం పరీక్షల సంఖ్య 62,57,745కు పెరిగింది. 676 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.
- ఇదీ చూడండి :కొవాగ్జిన్ టీకా సురక్షితమే: భారత్ బయోటెక్