- 54 ఏళ్ల వ్యక్తిలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. నాలుగైదు రోజులు సొంతంగా మందులు వాడారు. లక్షణాలు చేయిదాటి, తీవ్ర శ్వాసకోశ సమస్యకు దారితీసింది. గాంధీ ఆసుపత్రికి తరలిస్తే కరోనాగా నిర్ధారించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు.
- 43 ఏళ్ల మహిళ అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారు. మూత్రపిండాల వైఫల్య జబ్బుకు చికిత్స పొందుతున్నారు. కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు.
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కొవిడ్ మరణాలూ పెరుగుతున్నాయి. కరోనా మరణాలను విశ్లేషిస్తే.. ప్రధానంగా రెండు కారణాలను వైద్యులు గుర్తించారు. మొదటిది అత్యధికుల్లో కరోనాతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బు, మూత్రపిండాల వైఫల్యం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి.. తదితర అనుబంధ అనారోగ్య సమస్యలు ఉండటం. రెండోది కరోనా లక్షణాలను గుర్తించినా ఆలస్యంగా చికిత్సకు వచ్చినవారిలో మరణాల రేటు అధికంగా ఉండటం.
ఎక్కువ కేసులు నమోదైతే తదనుగుణంగా మరణాల సంఖ్యా హెచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. అసలు వైరస్ బారినపడడాన్ని తగ్గించగలిగితే మృతుల సంఖ్య కూడా తగ్గుతుంది. అందుకే వైరస్ వ్యాప్తి కట్టడికి విస్తృత ప్రచారం కల్పిస్తూనే.. మరణాలకు కారణాలైన ఆ రెంటిపైనా ప్రధానంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్లాస్మాథెరపీతో పాటు యాంటీ వైరల్ ఔషధాలను సైతం చికిత్సకు వినియోగించాలని ఆదివారం మంత్రి ఈటల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆరోగ్యశాఖ తీర్మానించింది.