వైరస్‌తో మరణించిన వారి మృతదేహాలను చూసేందుకు కొన్నిచోట్ల కుటుంబ సభ్యులూ ముందుకు రావడం లేదు. కొందరు మాత్రం ప్రభుత్వాసుపత్రుల మార్చురీ గదుల్లోని భౌతిక కాయాలను దూరంగా ఉండి చూసి వెళ్లిపోతున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం, వైరస్ తమకూ సోకుతుందోమోనన్న భయంతో ఇలా వ్యవహరిస్తున్నారు. మృతదేహాల నుంచి వైరస్ ఇతరులకు సోకుతుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నా ప్రజల్లో అపోహలు తొలగడం లేదు. ప్రభుత్వాసుపత్రులు, పురపాలక, కార్పొరేషన్ అధికారులే మృతదేహాలను ఖననం చేయించాల్సి వస్తోంది.
వైరస్ సోకుతుందనే అపోహ..
కొవిడ్ రోగి బంధువులు మృతదేహాన్ని ఖననం చేయడానికి చొరవ చూపని సమయంలో అధికారులే అందుకు ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. ఏదో ఒక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే సమస్య ఎదురవుతోంది. కరోనా రోగిని ఖననం చేస్తే ఆ చుట్టుపక్కల వారికి కూడా వైరస్ సోకుతుందనే అపోహ ప్రజల్లో ఉంది. ఈ కారణంగా మృతదేహాలను శ్మశానానికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం మధ్య సమన్వయం కొరవడింది. కొన్ని చోట్ల అంత్యక్రియలు నిర్వహించటంలో ఆలస్యమై రెండు, మూడు రోజుల పాటు మృతదేహాలను అలాగే ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. ఇక కరోనా రోగులకు చికిత్స అందించే చోటే మృతదేహాలను ఉంచుతున్నారన్న వార్తలూ భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ఆవేదన కలిగిస్తోంది.
అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకొని రెండు, మూడు చోట్లకు వెళ్లినా ఒక్కోసారి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చేసేదేమీ లేక పోలీసులే రంగంలోకి దిగి అందరికీ నచ్చ చెప్పటమో..చెదరగొట్టటమో చేసి ఆ తంతు ముగిస్తున్నారు. కొన్ని సార్లు రోజంతా మృతదేహాన్ని పలుచోట్లకు తిప్పినా ఖననం చేయలేని పరిస్థితి అందరి హృదయాలను కలచి వేస్తోంది. అనేక పరిణామాల మధ్య అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. వివాదం కాకుండా అంత్యక్రియలు ముగించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. కరోనా వైరస్ ఏ రూపంలో ఎవరికి సోకుతుందో గుర్తించలేరు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలున్నాయి. తీరని విషాదంలో ఉంటున్న కుటుంబాలకు ఈ మృతదేహాల ఖననం జరుగుతున్న తీరు మరింత ఆవేదన కలిగిస్తోంది.
ఎక్కడా సాఫీగా సాగటం లేదు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొవిడ్ కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధంగా చనిపోయినా శవం నుంచి నమూనా తీసి కరోనా పరీక్ష చేయాలి. రిపోర్టు రావడం ఆలస్యమైతే పాజిటివ్ కేసుగానే భావించి అంత్యక్రియలు నిర్వహించాలి. మృతదేహాలను జిప్ బ్యాగ్‌లో భద్రపరచి, వైరస్ ఇతరులకు సోకకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుని ఖననం చేయించాలి. మృతదేహాన్ని వారి గ్రామాలకు తీసుకెళ్లాక 20 నుంచి 30 మంది వరకు బంధువులు అక్కడికి రావడానికి అనుమతిస్తారు. అధికారుల పర్యవేక్షణలో అంత్యక్రియలు సాగాలి. ఈ ప్రక్రియ ఎక్కడా సాఫీగా సాగటం లేదు. ఇక కొన్ని చోట్ల అంతిమ సంస్కారం అనే మాటకే అర్థం లేకుండా చాలా దారుణమైన స్థితిలో అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది. సామూహిక ఖననాలు జరుగుతున్నాయి. తమ వారెవరో, ఎక్కడున్నారో, కనీసం ఏ చితిపై కాలుతున్నారో గుర్తించలేని దయనీయ స్థితి నెలకొంది.