ఏపీలో కొవిడ్ మహమ్మారి రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది. గతంలో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్తగా 16,238 మందికి పరీక్షలు నిర్వహించగా...1178 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే పరీక్షలు నిర్వహించిన ప్రతి వంద మందిలో 7.11 మందికి కరోనా సోకుతోంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలతో పోలిస్తే ఈ సంఖ్య 1.76 శాతంగానే ఉన్నా.. తొలినాళ్లతో పోలిస్తే ఇప్పడు పాజిటివ్ కేసుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,257 మందికి కరోనా సోకగా... అందులో 898 మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారే. తెలంగాణ నుంచి వెళ్లిన వారిలోనూ ఎక్కువ మందికి పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 420 మందికి కరోనా సోకగా...వీరిలో 337 మంది కువైట్ నుంచి వచ్చిన వారే ఉన్నారు.
గుంటూరులో ఉద్ధృతి
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజుల్లోనే 480 మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలో కేసులు పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే ఏకంగా 281 కేసులు బయటపడ్డాయి.