తెలంగాణ పోలీసు శిక్షణ సంస్థలో కరోనా వ్యాప్తితో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అకాడమీ ఆవరణలోనే ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందే ఓ ఐపీఎస్ అధికారితో పాటు ముగ్గురు అదనపు ఎస్పీలు, మరో ముగ్గురు డీఎస్పీలకు పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు కరోనా నిర్ధరణ అయిన వారెవరిలోనూ ముందస్తు లక్షణాలు కనిపించలేదు.
అందరూ ఒకే ఆడిటోరియంలో..
కొద్ది రోజుల క్రితం ఓ అటెండర్‌కు లక్షణాలు కనిపించడం వల్ల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన అధికారులు.. పలువురికి పరీక్షలు నిర్వహించారు. 59 మందిలో 37 మందికి పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తించింది. ప్రస్తుతం అకాడమీలో 1900 మంది శిక్షణలో ఉన్నారు. అందరికీ పరీక్షలు చేయిస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వారందరూ ఒకే ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది.
మరో పది రోజుల్లో పరీక్షలు నిర్వహించనుండగా... ప్రస్తుతం సన్నద్దత కోసం సెలవులు ప్రకటించారు. వారంతా ఐసోలేషన్‌లో ఉండడం కొంత ఊరట కలిగించే అంశంగా మారింది.
ఇవీచూడండి:తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు