తెలంగాణ

telangana

ETV Bharat / city

వామ్మో...గుంటూరు!

కరోనా వ్యాప్తి ఏపీలోని గుంటూరు జిల్లా వాసుల్లో గుబులు రేకెత్తిస్తోంది. కరోనా ఉద్ధృతితో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్ 19 కేసుల్లో గుంటూరు జిల్లా ఆంధ్రాలోనే రెండో స్థానంలో ఉండగా.. గుంటూరు నగరంలోనే ఎక్కువగా కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. ఈ పరిస్థితుల్లో నగరంలో ఇవాళ పూర్తిస్థాయి లాక్‌డౌన్ పాటించనున్నారు.

corona in guntur
వామ్మో...గుంటూరు!

By

Published : Apr 12, 2020, 8:45 AM IST

వామ్మో...గుంటూరు!

కరోనా నివారణ, నియంత్రణ చర్యలు వేగవంతం చేస్తున్నప్పటికీ అంతే వేగంగా కేసులు నమోదు కావడం గుంటూరు జిల్లా అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నిన్న ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదు కాగా... జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 75కి చేరింది. ఏపీలోని కర్నూలు తర్వాత అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు నిలిచింది. ఒకే ఇంటిలో 10 మందికి పాజిటివ్‌గా తేలడం కరోనా తీవ్రతకు నిదర్శనం. దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వైరస్‌ ప్రభావంతో మృతి చెందారు. జిల్లాలో కరోనా కారణంగా చోటుచేసుకున్న రెండో మరణం ఇది.

నేడు పూర్తి లాక్​డౌన్

ఈ పరిస్థితుల్లో గుంటూరు నగరంలో ఇవాళ పూర్తిస్థాయి లాక్​డౌన్ ప్రకటించారు. మందుల దుకాణాలు, అత్యవసర వైద్యసేవలు తప్ప నిత్యావసరాలు, కూరగాయల అమ్మకాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో 12 కంటైన్మెంటు జోన్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిషేధించారు. ప్రజలు ఏం కావాలన్నా స్థానికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు. రహదార్లపై అనవసరంగా వచ్చే వాహనదారులపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని అధికారులు హెచ్చరించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను వేరుచేసే శంకర్ విలాస్ కూడలి, కంకరగుంట ఆర్వోబీలను పూర్తిగా దిగ్బంధం చేయనున్నారు.

గుంటూరులోనే 56 కేసులు

ఇతర జిల్లాల్లో ప్రాంతాల వారీగా కేసులు నమోదవుతుండగా ఒక్క గుంటూరు నగరంలోనే 56 మందికి వైరస్‌ సోకింది. శ్రీనివాసరావుతోట, శ్రీనివాసరావుపేట, సంగడిగుంట, ఆనందపేట, మంగళదాస్‌ నగర్‌, కుమ్మరి బజార్‌, అరండల్‌పేట, రెడ్లబజార్‌, బుచ్చయ్యతోట ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఒకచోట కేసు నమోదైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత మందికి వ్యాపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌ రాగా... దిల్లీ నుంచి వచ్చిన వారు, వారి సన్నిహితులు ఎక్కువ మంది వైరస్‌ బారిన పడ్డారు. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి రాకున్నా కొందరికి కరోనా సోకింది. ఈ పరిస్థితిని అధికారులు సామాజిక వ్యాప్తిగా పరిగణిస్తూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తాజాగా మాస్కుల వాడకం తప్పనిసరి చేశారు.

ఇవీచూడండి:కరోనా విజృంభణ: 503కు చేరిన కేసులు

ABOUT THE AUTHOR

...view details