తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసు శాఖలో వైరస్​ వ్యాప్తి.. హోంగార్డుల నుంచి ఐపీఎస్​ల వరకు..

Corona cases in police Department: పోలీస్ శాఖలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హోంగార్డు నుంచి ఐపీఎస్​ల వరకు క్రమంగా వైరస్ బారిన పడుతున్నారు. గత రెండు దశలతో పోలిస్తే.. ఈసారి కొవిడ్ ప్రభావం పోలీసుల పైన ఎక్కువగానే ఉంది. నిత్యం ప్రజలతో మమేకమవ్వాల్సి ఉండటం వల్ల... జాగ్రత్తలు తీసుకుంటున్నా కొంత మంది పోలీసులకు కరోనా సోకుతోంది. దీంతో బూస్టర్ డోసుల వేగం పెంచాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Corona cases increasing in police Department
Corona cases increasing in police Department

By

Published : Jan 15, 2022, 4:00 PM IST

Corona cases in police Department: కరోనా తొలి దశ నుంచి పోలీసులు ఫ్రంట్​లైన్ వారియర్స్​గా వ్యవహరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం లాక్​డౌన్ విధించిన సందర్భంలోనూ ఎంతో కీలకంగా వ్యవహరించి... రహదారులపైకి ప్రజలు ఎవరూ రాకుండా చూడటంలో సఫలీకృతమయ్యారు. కరోనా వ్యాపిస్తున్న సమయంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా విధులు నిర్వర్తించారు. రహదారులపై తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి... వాహనదారుల వివరాలు తెలుసుకుంటూ అకారణంగా వచ్చే వాళ్లపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జరిమానా విధించారు. కరోనా రోగులను వైద్య ఆరోగ్య శాఖ సాయంతో అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించడం.... రోగితో కాంటాక్టులో ఉన్న వాళ్ల వివరాలను సేకరించి వాళ్లను ఇళ్ల నుంచి బయటకి రానీయకుండా చూడటంలో పోలీసులు ముందంజలో ఉన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలను బయటకు రానీయకుండా... బయటి వాళ్లను ఆ ప్రాంతాలకు వెళ్లకుండా 24 గంటలు పహారా కాశారు.

మొదటి దశలో అహర్నిషలు శ్రమిస్తూ..

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపించడంతో పాటు... హైదరాబాద్​లో ఉన్న కూలీలకు నిత్యావసర సరకులతో పాటు.. రోజూ ఒక పూట భోజనం అందించారు. ఇలా అన్ని తామై వ్యవహరించిన క్రమంలో చాలా మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బంజారాహిల్స్, ఎస్సార్​ నగర్ పోలీస్​స్టేషన్లలో అయితే ఒకే రోజు పదుల సంఖ్యలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి సిబ్బంది యోగక్షేమాలను కనుక్కున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా తీవ్రత పెరిగి పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి మొదలుకొని ఏఎస్సై స్థాయి అధికారులు పదుల సంఖ్యలో మృతి చెందారు.

ఈసారి మరింత పెరిగిన సంఖ్య..

మొదటి దశతో పోలిస్తే... రెండో దశలో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. రెండో దశతో పోలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఉన్నతాధికారులు కరోనా బారిన పడ్డారు. వీళ్లలో ఒకరు ఐపీఎస్ అధికారి కాగా.. మరొకరు నాన్​కేడర్ ఎస్పీ అధికారి. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు కూడా పదుల సంఖ్యలో వైరస్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. సరూర్​నగర్ పీఎస్​లో ఒకే రోజు ఆరుగురు కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలోనూ 15 మందికి పైగా కరోనాతో సెలవులో ఉన్నారు. రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లలోనూ చాలా మంది రక్షకభటులు మహమ్మారి బారిన పడుతున్నారు.

కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్​ల వరకు..

పోలీస్​స్టేషన్లకు నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదుదారులు వస్తుంటారు. వాళ్ల నుంచి వివరాలు సేకరించడం, క్షేత్రస్థాయిలో వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేయడం పోలీసులు చేయాల్సి తప్పనిసరి విధులు. బందోబస్తులో భాగంగా రద్దీ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అనుమానితులు, నేరస్థులను అదుపులోకి తీసుకోవడం, వాళ్లను ప్రశ్నించడం... కోర్టులో హాజరు పర్చడం, ఆ తర్వాత జైలుకు తరలించడం... ఇవన్నీ దగ్గరుండి మరీ చేయాల్సిన పనులు. కానిస్టేబుళ్లు ఏమాత్రం అలక్ష్యం వహించినా... అధికారుల ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది. ఇతర శాఖలతో పోలిస్తే పోలీస్ శాఖ క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. చిన్న పొరపాటు దొర్లినా తాఖీదులు వస్తాయనే భయంతో పోలీసులు విధులు నిర్వహిస్తుంటారు. రాస్తారోకోలు, ధర్నాల సందర్భంగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది కానిస్టేబుళ్లు వైరస్ బారిన పడుతున్నారు. పోలీస్ స్టేషన్​లో కేసులకు సంబధించిన వివరాలు వెల్లడించే క్రమంలో, పెండింగ్, రోజువారీ కార్యకలాపాల దస్త్రాలు పరిశీలించే క్రమంలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐలకు వైరస్ వ్యాప్తి చెందుతోంది.

వేగంగా బూస్టర్​ డోసు..

మూడో దశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండంతో కరోనా బారిన పడుతున్న వాళ్ల సంఖ్య కూడా పోలీస్ శాఖలో ఎక్కువగా ఉంటోంది. దీంతో ఉన్నతాధికారులు బూస్టర్ డోస్ వేగం పెంచాలని ఆదేశించారు. ఆయా పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేయిస్తున్నారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. వైరస్ ఎక్కువగా సోకుతున్నప్పటికీ.... దాని ప్రభావం తక్కువగా ఉండటంతో 10 రోజుల వ్యవధిలోనే పోలీసులు తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో దాదాపు అందరూ కొవిడ్​ వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నారు. బూస్టర్ డోసు కూడా వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్టేషన్ల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించి అందరూ బూస్టర్ డోసు తీసుకునేలా చూస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details