రాష్ట్రంలో మరో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
20:37 June 30
రాష్ట్రంలో మరో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,339 చేరింది.
కొత్తగా 7 మరణాలు.. 1712మంది డిశ్చార్జి
ఈ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో మరో ఏడుగురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 260కి పెరిగింది. తాజాగా మరో 1,712 మంది కోలుకున్నారు. వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,294కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8785మంది చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్‌పై పంజా
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 869 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు హైదరాబాద్ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి 21, మేడ్చల్ 13 కేసుల చొప్పున నమోదయ్యాయి.