తెలంగాణ

telangana

ETV Bharat / city

నివురుగప్పిన నిప్పులా కరోనా.. జాగ్రత్త పడకపోతే ముప్పేగా! - telangana covid cases

భయమొద్దు. అలాగని అలసత్వం పనికిరాదు. నిబ్బరం కావాలి గానీ నిర్లక్ష్యం తగదు. కరోనా జబ్బు విషయంలో ఇప్పుడిలాంటి విజ్ఞతే అవసరం. మహా సునామీ నుంచి బయటపడినా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. నివురుగప్పిన నిప్పులా ప్రమాదం పొంచే ఉంది. విదేశాల్లో మాదిరిగా మనదగ్గరా మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం మనమే. పని గట్టుకొని వైరస్‌ మన దగ్గరికేమీ రావట్లేదు. వైరస్‌ ఉన్న చోటుకి మనమే వెళ్తున్నాం. అంటుకునేలా చేసుకుంటున్నాం. జాగ్రత్త పడకపోతే కుదుట పడిన పరిస్థితి దిగజారటం ఖాయం.

corona-cases-are-increasing-in-india
నివురుగప్పిన నిప్పులా కరోనా

By

Published : Mar 16, 2021, 7:25 AM IST

రోనా విషయంలో ఇప్పుడే సంబరపడిపోవటానికి లేదని తాజా పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ఆ మహమ్మారి ఇంకా చావలేదనీ గుర్తుచేస్తున్నాయి. తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోంది మరి. కరోనా భయాన్ని పోగొట్టటానికి మొదట్లో వైద్యులు, నిపుణులు ఇచ్చిన ఉపశమన వచనాలే ఇప్పుడు బెడిసికొడుతున్నట్టు కనిపిస్తున్నాయి. మనకు రోగనిరోధకశక్తి ఎక్కువన్న ధీమానో, మరణాలు అంతగా లేవన్న భరోసానో, టీకా వచ్చిందన్న ధైర్యమో, ఆసుపత్రుల్లో చికిత్స సదుపాయాలు ఉన్నాయన్న నిబ్బరమో.. కారణమేదైనా కొవిడ్‌-19 అంటే ప్రస్తుతం మనలో నిర్లక్ష్య భావన పెరిగిపోయింది.

బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించాలనే విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. మొదట్లో జేబులో శానిటైజర్‌ పెట్టుకొని వెళ్లినవారే ఇప్పుడు వీటి వంకైనా చూడటం లేదు. కనీసం తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలన్న స్పృహ కూడా ఉండటం లేదు. ఇలాంటి నిర్లక్ష్యమే సార్స్‌-కోవీ 2 చాపకింద నీరులా విస్తరించేలా చేస్తోంది. అదృష్టం కొద్దీ కరోనా జబ్బు విదేశాల్లో మాదిరిగా మనదగ్గర అంత ఉద్ధృతంగా లేకపోవచ్చు. పెద్ద వయసువారి సంఖ్య తక్కువగా ఉండటం, అప్పటికే ఇతరత్రా కరోనా వైరస్‌ రకాల ఇన్‌ఫెక్షన్లు వచ్చి ఉండటం, వీటితో కొత్త కరోనా వైరస్‌ను తట్టుకునే శక్తి లభించి ఉండటం వంటివన్నీ వరంగా పరిణమించి ఉండొచ్చు. కానీ ఇటీవలి కాలంలో కరోనా జబ్బు మళ్లీ పెరుగుతున్నమాట మాత్రం నిజం. ఒక్క నెలలోనే కొవిడ్‌-19 కేసులు రెట్టింపయ్యాయి. ఇవన్నీ పూర్తిగా నివారించుకోదగ్గవే. అయినా ఎందుకింత నిర్లక్ష్యం? ఇతరదేశాల్లోనూ ముందు కేసుల సంఖ్య తగ్గిపోయి, అనంతరం పెరుగుతూ వస్తున్నాయి. మనకూ అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.

మొదట్లోనూ కరోనా మనదగ్గర 6 నెలల తర్వాతే మొదలయ్యిందనే విషయం మరవరాదు. దీంతో మనదేశంలోనూ తిరిగి ఉద్ధృతమవ్వచ్చనే భయం పుడుతోంది. అందువల్ల కీడెంచి మేలెంచాలి. అంత ఉద్ధృతం కాకపోతే మంచిదే గానీ అసలు జబ్బే రాదనే అతి విశ్వాసం పనికిరాదు. ఇటీవల సార్స్‌-కోవీ 2 కొత్తరకాలూ పుట్టుకొస్తున్నాయి. ఇవి చాలా వేగంగానూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నాయి. వైరస్‌ జన్యుక్రమాన్ని అంతగా విశ్లేషించలేకపోవటం వల్ల బయటపడటం లేదు గానీ ఇవి మనదేశంలోనూ ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి నిర్లక్ష్యం తగదు. కరోనా తిరిగి వస్తుందా? అని కాదు.. కరోనా ఎక్కడికీ పోలేదు, ఇక్కడే ఉందనే సంగతిని తెలుసుకొని నడచుకోవాలి.

లక్షణాలుంటే వెంటనే చికిత్స

కరోనా జబ్బు తీవ్రమై, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నవారిలో చాలామంది చికిత్స ఆలస్యమైనవారే. కాబట్టి దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలుంటే జబ్బు ఉందనే అనుకోవాలి. నిర్ధారణ పరీక్ష చేయించుకొని వెంటనే చికిత్స తీసుకోవాలి. లక్షణాలు ఉండి, పరీక్ష నెగెటివ్‌ వచ్చినా కూడా మందులు వాడుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులుంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. ఇప్పుడు కరోనా చికిత్స దాదాపుగా ఓ ప్రామాణిక రూపు సంతరించుకుంది. త్వరగా చికిత్స ఆరంభిస్తే జబ్బు తీవ్రం కాకుండా, మరణాలు సంభవించకుండా చూసుకోవచ్చు.

మరణాలు తక్కువే అయినా..

కరోనాజబ్బు మీద భయం తగ్గటానికి ప్రధాన కారణం మరణాల సంఖ్య తక్కువగా ఉండటం. అంతమాత్రాన ఎవరికి ప్రాణాంతకంగా మారుతుందన్నది ముందే తెలియదు. జబ్బు ముదురుతున్నకొద్దీ తీవ్రత బయటపడుతుంది. చికిత్సకయ్యే ఖర్చు, కుటుంబం పడే ఇబ్బందుల వంటివి పక్కనపెడితే.. జబ్బు నుంచి కోలుకున్నా కరోనా దుష్ప్రభావాలు దీర్ఘకాలం వెంటాడుతూ వస్తున్నాయని మరవరాదు. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు.. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, నిస్సత్తువ, నీరసం, ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడటం, కొందరికి కొత్తగా మధుమేహం తలెత్తటం, కొవిడ్‌ చికిత్సలో వాడే మందులతో కొందరికి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వంటి ఇబ్బందులెన్నో చుట్టుముడుతున్నాయి. మగవాళ్లలో కొందరిలో తాత్కాలికంగా వీర్యం నాణ్యత, శుక్రకణాల కదలిక తగ్గుతున్నట్టూ కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాతా కొందరికి సిరల్లో, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడటం, పక్షవాతం, గుండెజబ్బుల వంటి తీవ్ర సమస్యలూ దాడిచేస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందులేమీ లేకపోయినా చాలామందిలో శరీర సామర్థ్యం, బలం తగ్గిపోతుండటం గమనార్హం. అందువల్ల మరణాలు తక్కువన్న దృష్టితో తేలికగా తీసుకోవటం తగదు. జాగ్రత్తలను విడవకుండా పాటించాలి.

* బయటకు ఎక్కడికి వెళ్లినా విధిగా మాస్కు ధరించాలి.

* ఇతరులకు కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి.

* తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సబ్బుతో కడుక్కునే వీలు లేకపోతే చేతులకు శానిటైజర్‌ రాసుకోవాలి.

వీటిని కచ్చితంగా పాటించటం మనందరి విధి, బాధ్యత. వీటితో కరోనా జబ్బు బారినపడకుండా చాలావరకు కాపాడుకోవచ్చు.

టీకాపై భయాలు, అపోహలొద్దు

మధుమేహం వంటి దీర్ఘకాల జబ్బులతో బాధపడే కొందరు టీకా తీసుకోవటానికి సందేహిస్తుండటం కనిపిస్తోంది. ఇలాంటివేవీ పెట్టుకోవద్దు. మనదేశంలో ఇప్పటికే సుమారు 3 కోట్ల మందికి టీకాలు ఇచ్చారు. ఎవరిలోనూ పెద్దగా దుష్ప్రభావాలు లేవు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. ఇప్పుడు ధ్రువీకృత ఫొటో గుర్తింపుకార్డు చూపిస్తే అప్పటికప్పుడే నమోదు చేసుకొనీ టీకా ఇచ్చేస్తున్నారు.

* ఆస్ప్రిన్‌, కొపిడెగ్రిల్‌ వంటి రక్తాన్ని పలుచబరచే మందులేసుకునేవారు సైతం నిర్భయంగా టీకా వేయించుకోవచ్చు. మందులు ఆపాల్సిన అవసరం లేదు.

* రక్తం గడ్డకట్టకుండా చూసే మందులు వేసుకునేవారు రక్తం గడ్డకట్టే తీరును తెలిపే పీటీఐఎన్‌ఆర్‌ పరీక్ష చేయించుకున్నాకే వేసుకోవాలి. ఇలాంటి మందుల మోతాదు పెరిగితే రక్తం పలుచగా అవుతుంది. తగ్గితే రక్తం గడ్డ కడుతుంది. పీటీఐఎన్‌ఆర్‌ 2-3 మధ్యలో ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇది ఎక్కువగా ఉంటే రక్తం గడ్డ ఏర్పడొచ్చు. అదీ సూది గుచ్చటం మూలంగానే గానీ ప్రత్యేకించి టీకాతో తలెత్తే ఇబ్బందేమీ కాదు.

* కిడ్నీజబ్బులు, గుండెజబ్బులు, ఆస్థమా వంటి సమస్యలు గలవారు సైతం టీకా తీసుకోవచ్చు.

* పేస్‌మేకర్‌, కృత్రిమ కవాటాలు, ప్లేట్లు, రాడ్ల వంటివి అమర్చుకున్నా తీసుకోవచ్చు.

* క్యాన్సర్‌, కీళ్లవాతం వంటి సమస్యలు గలవారు రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకుంటుంటారు. ఇవి కొంతవరకు టీకాకు రోగనిరోధక ప్రతిస్పందనను తగ్గిస్తుండొచ్చు గానీ ప్రభావమైతే ఉంటుంది. కాబట్టి ఇలాంటివాళ్లూ తీసుకోవచ్చు.

* రెండో మోతాదును నిర్ణీత సమయానికి తీసుకోలేని పరిస్థితుల్లో వీలైనంత త్వరగా తీసుకోవాలి.

టీకా తీసుకున్నా జాగ్రత్తలు తప్పనిసరి

టీకా తీసుకున్నాం కదా, ఇక మునుపటిలా ఎక్కడికైనా వెళ్లొచ్చని అనుకోవటానికి లేదు. టీకా తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌ అసలే రాదని చాలామంది భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. టీకాతో జబ్బు తీవ్రం కావటం పూర్తిగా ఆగిపోవచ్చు గానీ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకూడదనేమీ లేదు. రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన ఒకొకరిలో ఒకోలా ఉంటుంది. టీకా సామర్థ్యం 80% అనుకుంటే.. దీన్ని తీసుకున్నవారిలో నూటికి 80 మందికి రక్షణ కల్పిస్తుందని అర్థం. వీరికి ఇన్‌ఫెక్షన్‌ నుంచి పూర్తిగా రక్షణ లభించొచ్చు లేదూ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా రోగనిరోధక వ్యవస్థ వైరస్‌ను త్వరగా నిర్మూలించటం వల్ల లక్షణాలేవీ తలెత్తకపోవచ్చు. మిగతా 20% మందికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశమైతే ఉంటుంది. కానీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సినంత తీవ్రం కాకపోవచ్చు.

* టీకా రెండు మోతాదులు తీసుకున్నాక 2 వారాల తర్వాతే పూర్తి రక్షణ లభిస్తుంది. టీకా తీసుకున్నవారికీ వైరస్‌ సోకొచ్చు. అంత ఎక్కువగా కాకపోయినా వీరి నుంచీ ఇతరులకు వైరస్‌ వ్యాపించొచ్చు. అందువల్ల మాస్కు ధరించటం వంటి జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే. ఎక్కువ మందికి టీకాలు ఇవ్వటం వల్లనో, సామూహిక రోగనిరోధకశక్తి సంతరించుకోవటం వల్లనో మరో 3, 4 నెలల్లో కరోనా నుంచి పూర్తిగా బయటపడే అవకాశముంది. కనీసం అప్పటివరకైనా అప్రమత్తంగా ఉండటం మంచిది. లేకపోతే పరిస్థితి దిగజారిపోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details