తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో రోజు రోజుకూ విస్తరిస్తోన్న కరోనా...కర్నూల్​లో కలకలం - CORONA CASES ARE INCREASING DAY BY DAY IN ANDHRA PRADESH

రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. ఒక్కరోజులోనే 66 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. అందులో 52 కేసులు కర్నూలు జిల్లాకు సంబంధించినవే కావడం కలకలం రేపుతోంది. మొత్తంగా ఇప్పటివరకూ 258 మంది కరోనా బారిన పడగా... ఐదుగురు కోలుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కర్నూల్​లో కరోనా కలకలం... పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
కర్నూల్​లో కరోనా కలకలం... పెరుగుతోన్న పాజిటివ్ కేసులు

By

Published : Apr 6, 2020, 7:37 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజురోజుకీ వ్యాప్తి చెందుతోంది. కర్నూలులో ఒక్కసారిగా ఉద్ధృతరూపం దాల్చింది. జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 52 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కర్నూలు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. దీనిద్వారా మొత్తం కేసుల సంఖ్య 56కి చేరింది. కర్నూలు జిల్లాలో రెండ్రోజుల క్రితం కేవలం ఒకే ఒక్క పాజిటివ్ కేసు ఉండగా... శనివారం మూడు, ఆదివారం ఉదయం 23, సాయంత్రం 29 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీరపాండియన్‌ కోరారు. లాక్‌డౌన్‌కి సహకరిస్తూ, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలన్నారు.

వారికి కిట్లు, వెంటిలేషన్ సాకర్యం...

నెల్లూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 34కి చేరింది. దిల్లీలో మతపరమైన సమావేశానికి వెళ్లి వచ్చినవారు, సంబంధికులు కలిపి 253 మంది నమూనాలు పరీక్షించగా.... 34 పాజిటివ్‌ వచ్చాయి. పూర్తిస్థాయిలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం... అవసరమైన చర్యలు చేపట్టింది. బాధితుల కోసం 5వేల పడకలను సిద్ధం చేసింది. కడప జిల్లాలో ఇప్పటివరకూ 23 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకంతకూ తీవ్రత పెరుగుతున్నందున... నగరంలోని ఫాతిమా వైద్య కళాశాలలో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షల కేంద్రం సేవల్ని ప్రారంభించారు. వైద్యులకు కిట్లు, వెంటిలేషన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు.

వారి నమూనాలు ఎప్పటికప్పుడు పరీక్షలకే

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 17కి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్క రోజే 7 పాజిటివ్ కేసుల నమోదుతో అధికార యంత్రాగం హైఅలర్ట్ ప్రకటించింది. తిరుపతిలో 5 కేసులు, పలమనేరు 3, శ్రీకాళహస్తి 3, నగరి 2, రేణిగుంట 2, నిండ్ర, ఏర్పేడులలో ఒక్కో కేసు ఉన్నాయి. పాజిటివ్ వచ్చిన 17 మందిలో 14 మంది... దిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిగా గుర్తించారు. ఒకరు విదేశాల నుంచి వచ్చినట్లు తేల్చారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే ముగ్గురు కరోనా బాధితులు ఉండగా... మరో మూడు కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 23 మంది కరోనా బాధిత కేసులు ఉన్నాయి. వైరస్ మరింత విస్తరించకుండా జాగ్రత్త పడుతున్న అధికారులు... అనుమానితుల నమూనాలను ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపిస్తున్నారు.

గుంటూరులో లాక్ డౌన్ కట్టుదిట్టం

గుంటూరులో 15 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం 30 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వైరస్‌ బారిన పడ్డారు. ఈ పరిస్థితుల్లో గుంటూరు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 428 మంది నమూనాలు పరీక్షించగా... 326 నెగెటివ్‌గా వచ్చాయి. మరో 71 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో కరోనా సోకిన 28 మందికి చికిత్స కొనసాగుతోంది. పరీక్షలకు పంపిన 195మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

స్వీయ నిర్భంధంలోకి 156 మంది !

పశ్చిమగోదావరి 15 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 11మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. పశ్చిమగోదావరిలో మొత్తం 310 నమూనాలను పరీక్షించగా... 79 నెగిటివ్‌గా తేలాయి. మరో 231 శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. పాజిటివ్ వచ్చిన కేసుల ప్రాంతాల్లో 21వేల కుటుంబాలను గృహ నిర్బంధంలో ఉంచారు. తూర్పున కూడా వ్యాధి విస్తరించకుండా యంత్రాంగం అప్రమత్త చర్యలు చేపట్టింది. విశాఖ జిల్లాలో 492 నమూనాలు పరీక్షించిన వైద్యులు... 15 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధరించారు. 284 కేసులు నెగిటివ్ కాగా.... 193 కేసుల నివేదికలు రావాల్సి ఉంది. వైద్య నిర్బంధంలో ఉన్న వారిలో నెగిటివ్ వచ్చిన 156 మందిని వారి ఇళ్లకు తరలించి... స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా సూచించారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా

ABOUT THE AUTHOR

...view details