తెలంగాణ

telangana

ETV Bharat / city

దిగుబడి పెరిగినా కొనే నాథుడు లేక మక్క రైతుల ఆందోళన - corn farmers problems

మక్క రైతుల పరిస్థితి అయోమయంలో పడింది. దిగుబడి బాగా వచ్చినా... మద్దతు ధరకు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా అనుమతి ఇవ్వకపోవటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు కొంటారా...? కొనరా...? అన్న ప్రశ్నలు నెలకొన్నాయి.

corn farmers confused for selling of crop
corn farmers confused for selling of crop

By

Published : Apr 10, 2021, 8:28 AM IST

మొక్కజొన్న(మక్క) సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మద్దతు ధరకు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. మద్దతు ధరకు కొంటామని ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’(మార్క్‌ఫెడ్‌) సైతం ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదు. కానీ ప్రస్తుత యాసంగిలో సాగుచేసిన పంటంతా మద్దతు ధరకు కొనాలంటే రూ.3,442 కోట్లు అవసరమని మార్క్‌ఫెడ్‌ లెక్కలుగట్టింది.

ఈ సంస్థ కొన్నేళ్లుగా కొన్న పంటల రూపేణా ఇప్పటికే రూ.2 వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఇప్పుడు సొంతంగా దేన్నీ మద్దతు ధరకు కొనే పరిస్థితి లేదు. మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని ఆదేశిస్తే నిధులు సమకూర్చాలి. ఒకవేళ సర్కారు నిధులివ్వకపోతే ఈ సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవడానికి పూచీకత్తయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది దేశచరిత్రలోనే అత్యధికంగా 3 కోట్ల టన్నుల మొక్కజొన్నల దిగుబడి వచ్చిందని కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించడంతో పంట ధరలు పతనమవుతున్నాయి

తెలంగాణలో వ్యాపారులు క్వింటాకు రూ.1000 నుంచి రూ.1500కి మించి ఇవ్వడం లేదు. మొక్కజొన్న పంటపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. జాతీయ మార్కెట్‌లో గిరాకీ లేదని, ప్రస్తుత యాసంగిలో సాగుచేయవద్దని సీజన్‌ ఆరంభంలోనే రైతులకు వ్యవసాయశాఖ సూచించింది. అయినా.. రైతులు ఏకంగా 4.66 లక్షల ఎకరాల్లో అదే పంట వేశారు. మొత్తం 15.91 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని మార్కెటింగ్‌శాఖ తాజా అంచనా. మద్దతు ధర క్వింటాకు రూ.1850 చొప్పున చెల్లించి కొనాలంటే మార్క్‌ఫెడ్‌ వద్ద నిధులు లేవు. కేంద్రం మద్దతు ధరకు కొనే పంటల్లో మొక్కజొన్నను తెలంగాణకు అనుమతించలేదు. ఇప్పుడిక రైతులను ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే కొనాలి.

బడ్జెట్‌లో పంటల కొనుగోలుకు ‘మార్కెట్‌ జోక్యం పథకం’ కింద కేవలం రూ.500 కోట్లను ఈ ఏడాది(2021-22)లో అన్ని పంటలకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వీటిని కూడా ఇంతవరకూ మార్క్‌ఫెడ్‌కు విడుదల చేయలేదు. మక్కల కొనుగోలుపై ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డిని చెప్పారు. ప్రభుత్వం అనుమతి, నిధులిస్తే కొంటామని మార్క్‌ఫెడ్‌ ఎండీ యాదిరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details