విద్యుత్తు బిల్లులు అధికంగా వచ్చాయని వినియోగదారులు ఓ పక్క గగ్గోలు పెడుతుంటే.. మరోపక్క ఆన్‌లైన్ ఛార్జీలు వారిపై మరింత భారం మోపుతున్నాయి. లాక్‌డౌన్ నుంచే చాలామంది తమ బిల్లులను ఆన్లైన్లో చెల్లిస్తున్నారు. అయితే వీటిపై వసూలు చేస్తున్న సౌలభ్య రుసుం(కన్వియన్స్ ఛార్జీ)లను చూసి కంగుతింటున్నారు. ప్రస్తుతం అధిక బిల్లులతో ప్రతి ఒక్కరూ ఎంత చెల్లిస్తున్నామనే విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అదనంగా జేబు నుంచి చెల్లించేది ఎంత అనే లెక్కలు వేస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆన్‌లైన్ లావాదేవీలపై రుసుములు లేవని చెబుతున్నా.. సౌలభ్య రుసుములు మాత్రం తప్పడం లేదు.
ఉదాహరణ ఇలా..
ఉప్పల్‌కు చెందిన వినియోగదారుడికి మూడు నెలలకు కలిపి ఇచ్చిన బిల్లు రూ.1,644 ఆన్‌లైన్లో చెల్లించారు. బ్యాంకు ఖాతా నుంచి రూ.1658.79 కట్ అయ్యాయి. దాదాపుగా రూ.15 సౌలభ్య రుసుముగా మినహాయించారు. మరో వినియోగదారుడు రూ.685 చెల్లిస్తే రూ.691.16 ఖాతా నుంచి డెబిట్ అయ్యాయి. రూ.6 వరకు సౌలభ్య రుసుం చెల్లించారు. బిల్లు మొత్తాన్ని బట్టి క్రెడిట్ కార్డు అయితే 0.80 శాతం+ జీఎస్‌టీ, డెబిట్ కార్డుకు 0.90 శాతం+ జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రతి లావాదేవీపై 2.35 శాతం+ జీఎస్‌టీ వేస్తున్నారు. బిల్లులు పెరిగేకొద్దీ సౌలభ్య రుసుంలు పెరుగుతున్నాయి. వేలల్లో బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులు రూ.200 వరకు ఇలా చెల్లించిన దాఖలాలు ఉన్నాయి.