గ్రేటర్ వ్యాప్తంగా కొత్త నల్లాలు తీసుకునే వారి జేబుకు భారీగా చిల్లు పడుతోంది. ప్రతినెలా కనీసం 3-4 వేల వరకు కొత్త నల్లాలు జారీ చేస్తుంటారు. తొలుత దరఖాస్తుతోపాటు కనెక్షన్ ఛార్జీలను జలమండలికి చెల్లించాలి. 18 రోజుల తర్వాత నల్లా జారీ చేస్తారు. ఈ సమాచారాన్ని ఏరియా గుత్తేదారులకు జలమండలి పంపుతుంది. నల్లా ఇచ్చేటప్పుడే తప్పనిసరిగా నీటి మీటరు బిగించాలి. లేదంటే వినియోగదారుడికి అంకె(క్యాన్ నంబరు) కేటాయించడం సాధ్యపడదు. వాస్తవానికి నీటి మీటర్లను వినియోగదారులే కొనుక్కోవాలి.
గతంలో నాణ్యత ఉన్న పది కంపెనీలను జలమండలి ఎంపిక చేసి వాటిలో నచ్చిన కంపెనీది కొనుక్కోవచ్చని తెలిపింది. ఐఎస్‌ఐ మార్కు ఉన్న ఇతర కంపెనీల మీటర్లయినా అమర్చుకునే వెసులుబాటు కల్పించింది. కొవిడ్ వల్ల చాలామంది మార్కెట్‌కి వెళ్లి మీటర్లు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. దీంతో కొందరు గుత్తేదారులు, సిబ్బంది తామే మీటర్లు సరఫరా చేస్తామని అదనంగా గుంజుతున్నారు. వినియోగదారులు ఇతర కంపెనీల మీటర్లు కొన్నా.. అవి నాణ్యతతో ఉండవని...తప్పుడు లెక్కలు చూపిస్తాయని చెప్పి తమ వద్దే కొనేలా చేస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోంది.
- 15 ఎంఎం నీటి మీటరు మార్కెట్ ధర - రూ.1200
- గుత్తే దారులు వసూలు చేస్తోంది - రూ.2వేలకు పైనే
- గ్రేటర్‌లో ప్రతి నెల జారీ చేసే నల్లాలు - రూ.3-4వేలు
- ఒక్కో నల్లాకు వినియోగదారుడిపై పడే భారం - రూ.2000