Contaminated water incident: కలుషిత నీటితో హైదరాబాద్ జంట నగరాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్‌లో కలకలం రేపిన కలుషిత జలాల ఘటనలో బాధితుల సంఖ్య 76 మందికి చేరింది. గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో నిన్నటి వరకు 57 మంది ఆస్పత్రిలో చేరగా ఇవాళ మరో 19 మంది అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లక్షణాలతో కొండాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనరల్ వార్డులో 42 మంది..., చిన్నపిల్లల వార్డులో వార్డులో 34 మందికి చికిత్స జరుగుతోంది.
పట్టించుకునే నాథుడే లేదు..:బాధితుల్లో కొందరికి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొంత మందిలో కిడ్నీ సంబంధిత క్రియాటిన్ పెరగడంతో నిన్న ముగ్గురు, ఇవాళ ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఆరోగ్యం కుదుటపడిన 20 మంది బాధితులను ఇంటికి పంపించారు. ఇందులో ఇద్దరికి క్రియాటిన్ లెవల్ పెరుగుతోందని వారి ఆరోగ్యం అనుక్షణం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు. కలుషిత ఆహారం, లేదా కలుషిత నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు నిర్ధరించారు. మూడు నెలలుగా మంచినీరు దుర్వాసన వస్తోందని అధికారులకు చెప్పినా.. ఎవ్వరూ పట్టించుకోలేదని వడ్డెరబస్తీవాసులు తెలిపారు. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
నాలుగు నెలలుగా కలుషిత నీళ్లే..:ఇదిలా ఉంటే.. లంగర్‌హౌస్‌లోని గాంధీనగర్‌లో కలుషిత నీరు వస్తోందని స్థానికులు ఆందోళనకు దిగారు. గత నాలుగు నెలలుగా మురికి నీరు వస్తుందని.. జలమండలి అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్లు చేసినా స్పందన ఉండదని ఆరోపించారు. ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే.. అప్పటిపూర్తిగా సమస్యను పరిష్కారించారన్నారు. తర్వాత మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతోందని వాపోయారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే.. ఆందోళన చేస్తామని కాలనీవాసులు హెచ్చరించటంతో.. మొత్తానికి నీటి సరఫరానే ఆపేశారని తెలిపారు. బిందెలు, బాటిల్స్‌లో వాళ్లకు సరఫరా అవుతున్న నీటిని ప్రదర్శిస్తూ.. స్థానికులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.