గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణమైన తన్వీర్ ఆసుపత్రిపై జిల్లా వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.5 లక్షల పరిహారం చెల్లించడం సహా కేసు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.
సరూర్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు(78)ను అనారోగ్య సమస్యలతో కమలాపురి కాలనీలోని తన్వీర్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యుల సూచన మేరకు ఎల్‌ఎఫ్‌టీ, ఆర్‌బీఎస్, ఆర్‌ఎఫ్‌టీ, సీబీపీ, సీరం, క్రియాటినైన్, ఈసీజీ తదితర పరీక్షలన్నీ చేయించారు. తర్వాత రోజు రిపోర్టులు పరిశీలించిన వైద్యులు ఈసీజీ అసాధారణంగా ఉందని కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుందని శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు సూచించారు. భోజనం అనంతరం అతనికి ఎక్కువ చమట రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవ్వడం తదితర లక్షణాలుండటంతో మరోసారి నిర్ధారణ పరీక్షలు చేయగా మయోకార్డినల్ ఇన్‌ఫ్రాక్షన్‌గా గుర్తించి వెంటనే వెంటిలేటర్‌పై ఉంచారు.
కార్డియాలజిస్ట్‌ను పిలిపించకుండానే చికిత్స అందించడంతో శ్రీనివాసరావు 2017 ఫిబ్రవరి 11న మరణించారు. అప్పటి వరకు చికిత్స సహా ఇతర ఛార్జీలు కింద రూ.20 వేలు ముందస్తుగా వసూలు చేశారు. కార్డియాలజిస్ట్ ఉన్నారనే విషయం తెలపకుండా చికిత్స అందించి తన తండ్రి మరణానికి కారణమయ్యారంటూ శ్రీనివాసరావు కుమారుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.