ఖాతాదారునికి అందించాల్సిన సేవల్లో లోపం కనబర్చిన ఓ బ్యాంకు పనితీరును రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి బి.లింగారెడ్డికి స్థానిక ఆంధ్రాబ్యాంకులోని ఖాతా ఉంది. తనకు వచ్చే జీతం, ఇతర ఆదాయాలను అందులో జమ చేస్తుంటాడు. 2016 మేలో తన ఖాతాలో జమ చేసిన మొత్తం సొమ్ము వివరాలను తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లిన అతనికి విస్తుపోయే విషయం తెలిసింది. 2016 మార్చి, ఏప్రిల్ నెలల్లో 187 సార్లు ఏటీఎం కార్డు ద్వారా మొత్తం రూ.3,67,141 నగదు ఉపసంహరణ అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు.
బ్యాంకు సిబ్బంది అలసత్వం... ఫోరంలో ఫిర్యాదు
సొమ్ము మాయంపై బ్యాంకు మేనేజరుకు, సైబర్ క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సరైన ఫలితం లేనందున రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. నోటీస్ అందుకున్న ఆంధ్రాబ్యాంకు తమ నిర్లక్ష్యం లేదని, కేసు కొట్టి వేయాలని లిఖితపూర్వక సమాధానం తెలిపింది. కేసు విచారించిన ఫోరం... ఖాతాదారునికి సేవలందించడంలో బ్యాంకు అలసత్వం వహించినట్లు తేల్చింది.