Illegal Constructions: నగరాలు, పట్టణాల్లో కొత్త భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టం అమలులో ఉన్నా.. అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్లాన్ కాపీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినప్పటి నుంచే ముడుపులపర్వం మొదలవుతోంది. నగరాల్లో వార్డు ప్లానింగ్ కార్యదర్శుల నుంచి సహాయ పట్టణ ప్రణాళికాధికారి వరకు, పట్టణాల్లో ప్లానింగ్ కార్యదర్శి నుంచి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల వరకు వారు అడిగినన్ని డబ్బులిస్తే తప్ప ప్లాను అనుమతి దరఖాస్తులు ముందుకు కదలడం లేదు.
అనిశా అధికారులు ఈనెల 3 నుంచి 5వ తేదీ మధ్య పలు నగరాలు, పట్టణాల్లో చేసిన క్షేత్రస్థాయి తనిఖీల్లో అత్యధిక భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ప్లానుకు విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్‌బ్యాక్ వదలకపోవడం, పార్కింగ్ స్థలంలోనూ గదులు నిర్మించడం వంటి అక్రమాలు బయటపడ్డాయి. భవన నిర్మాణ ప్రాంతంలో రోడ్డు వెడల్పు తగినంత లేకపోయినా అనుమతులిచ్చినట్లు తేల్చారు. వార్డు సచివాలయాల్లో కొందరు ప్లానింగ్ కార్యదర్శులు కొత్త నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు లంచాలకు పాల్పడుతున్నారు. వీరికి అక్కడి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు తోడవుతున్నారు.