తెలంగాణ

telangana

ETV Bharat / city

కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు పరిశీలన... మార్చి మూడో వారంలోగా..

AP New Districts Collectorate Buildings : ఏపీలోని కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. అనువైన భవనాల కోసం అన్వేషిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో అవసరమైన భవనాల నిర్మాణానికి కనీసం రూ.1,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ వ్యయాన్ని తగ్గించాలని, అదనంగా నిధులు కేటాయించే పరిస్థితి ప్రస్తుతానికి లేనందున అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు ఆదేశాలు వెళుతున్నాయి.

AP New Districts Collectorate Buildings
AP New Districts Collectorate Buildings

By

Published : Feb 20, 2022, 3:35 PM IST

AP New Districts Collectorate Buildings : ఏపీలో కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. 2020 చివర్లోనే జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు సాగింది. అప్పుడు సేకరించిన వివరాలను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్నారు. జిల్లాల సరిహద్దుల గుర్తింపు, ఆస్తుల పంపకాలు, మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల కేటాయింపు, ఇతర చర్యల కోసం రాష్ట్రస్థాయిలో మాదిరిగానే జిల్లాల్లోను ఏర్పడ్డ నాలుగు కమిటీల ద్వారా చర్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా... ప్రధాన రహదారికి దగ్గర, నాలుగురోడ్ల కూడలి, గ్రామీణులకు అనుకూలం, ఇతర అంశాల ప్రాతిపదికన భవనాలను గుర్తిస్తున్నారు. పురపాలక సంఘ భవనాలు, వ్యాపార సముదాయాల వివరాలను సేకరిస్తున్నారు. అద్దెకు లభించే ప్రైవేటు విద్యాసంస్థల భవనాల సమాచారాన్నీ తెలుసుకుంటున్నారు. కొత్త జిల్లా, డివిజన్‌ హద్దులను భవనాల గుర్తింపులో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మార్చి మూడో వారంలోగా ప్రక్రియ పూర్తి చేయాలనే దిశగా కసరత్తు సాగుతోంది.

కసరత్తు ఇలా...

కొత్తగా ప్రకటించిన శ్రీబాలాజీ జిల్లాకు సుమారు 200కు పైగా గదులు అవసరమని గుర్తించారు. తిరుపతి అలిపిరి దగ్గర అసంపూర్తిగా ఉన్న 40 వేల చదరపు అడుగుల పర్యాటక శాఖ భవనాన్ని సిద్ధం చేయాలని తొలుత భావించారు. అదనపు వ్యయం, ట్రాఫిక్‌ సమస్యల దృష్ట్యా ఈ ప్రతిపాదనను పక్కనబెట్టారు. చివరకు తిరుచానూరు సమీపంలో ఐదేళ్ల నుంచి ఖాళీగా ఉన్న తితిదేకు చెందిన పద్మావతి నిలయం అనుకూలమని భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో నరసరావుపేట కేంద్రంగా పల్నాడు, బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లాలు ఏర్పడనున్నాయి. నరసరావుపేటలోని ఎన్‌ఎస్‌పీ కార్యాలయాల సముదాయంలో కలెక్టరేట్‌, పల్నాడు ప్రాంతీయ ఆసుపత్రిలో ఎస్పీ కార్యాలయం, జిల్లా న్యాయస్థానం, పంచాయతీరాజ్‌ అతిథిగృహంలో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఏర్పాటును పరిశీలిస్తున్నారు. బాపట్ల జిల్లాకు సంబంధించి గుంటూరు రోడ్డులో ఉన్న మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయాల్లో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న న్యాయస్థానాల సముదాయంలో జిల్లాకోర్టును ఏర్పాటు చేయనున్నారు. పుట్టపర్తిలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు తమ వద్ద ఉన్న భవనాలు ఇచ్చేందుకు సిద్ధమని అధికారులకు సత్యసాయి ట్రస్టు సభ్యులు తెలిపారు. స్థలం చూపితే ట్రస్టు తరఫున భవనాలూ నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు.

  • ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాకూ భవనాల అవసరముంది. కొత్త కలెక్టరేట్‌ను విజయవాడలోని సబ్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసేలా ప్రతిపాదించారు. తిరువూరులోని ఆర్డీవో కార్యాలయం కోసం అక్కడి క్రీడామైదానం భవనాలను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. తిరువూరు డివిజన్‌లో పోలీస్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతమున్న సర్కిల్‌ కార్యాలయం అద్దె భవనంలో నడుస్తోంది. నందిగామ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం కోసం ప్రభుత్వ భవనాల అన్వేషణ సాగుతోంది.
  • కోనసీమ జిల్లాకు అవసరమైన భవనాల కోసం అమలాపురంలోని చెన్న మల్లేశ్వరస్వామి దేవస్థాన భూములు, డీఆర్డీఏ ప్రాంగణం, పాత పోలీసు క్వార్టర్లను తాజాగా అధికారులు పరిశీలించారు.
  • జిల్లా కేంద్రంగా గుర్తించిన పాడేరులో కేంద్ర కార్యాలయాలను ప్రస్తుత డివిజన్‌ కార్యాలయాలు ఉన్నచోటే ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టరేట్‌గా మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి:బుల్డోజర్ల వ్యాఖ్యలు... రాజాసింగ్​పై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details