మూసీ కాలుష్యం.... వెల కట్టలేని నష్టం నాడు నగరానికి వరప్రదాయినిగా భావించిన మూసీ నది.... ప్రస్తుతం ఎన్నో గ్రామాలకు దుఃఖదాయినిగా మారింది. కలుషిత జలాలు కేవలం మూసీనదికే పరిమితం కాలేదు. ఆ కాలుష్య జలాలు భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి, కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు నాశనమౌతున్నాయి. పదుల సంఖ్యలో పరిసర గ్రామాలు సర్వనాశనమవుతున్నాయి. 48 గ్రామాల్లో బోరుబావులు, చేతిపంపులు, ఇతర నివాస బోర్లలో ఆర్సినిక్, నైట్రేట్, కోబాల్డ్, కాడ్మియం, నికిల్, యురేనియం వంటి ప్రమాదకర లోహాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
కాలుష్య రసాయనాలు, లోహాలతో నిండిన భూగర్భ జలాలు...
ఇప్పటికే మూసీనదిలో ఎక్కడ చూసినా బండరాళ్లపై కాలుష్యపు మరకలు కనిపిస్తున్నాయి. అవన్నీ ఎరుపు రంగుకు మారిపోయి ఉంటాయి. మూసీకి రెండు వైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర కాలుష్య ప్రభావం కన్పిస్తోంది. 3 కిలోమీటర్ల పరిధిలో అయితే... తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. ప్రమాదకర రసాయనాలు, లోహాలతో నిండిపోయిన భూగర్భ నీటిని వినియోగించడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆకుకూరలు తింటే అంతే సంగతులు...
మూసీ జలాలనే దిగువనున్న రైతులు సాగుకు వినియోగిస్తున్నారు. వరితోపాటు తోటకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర లాంటి ఆకుకూరలు పండిస్తున్నారు. మూసీ ఒడ్డున ఉండే భూముల్లో బోర్లు వేసి ఆ కాలుష్య జలాలతోనే పంటలు పండిస్తున్నారు. ఆ నీటితో పెరిగిన ఆకుకూరల్లో రసాయన అవశేషాలు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు స్వయంగా వ్యవసాయ శాఖ ఓ పరిశోధనలో బయటపెట్టింది. అయినా గత్యంతరం లేని రైతులు ఆకుకూరల సాగును వదలడం లేదు. నగరవాసులూ వాటిని తెలియకుండానే తింటున్నారు.
ఒకప్పుడు వరి పండించేవారు....
మూసీ పరివాహక ప్రాంతంలోని గ్రామాల రైతులంతా ఆ జలాలతోనే వరి పండించేవారు. 1970 వరకు దిగుబడులు బాగా ఉండేవి. మూసీనీటిని నిల్వ చేసుకుని, పంటలకు మళ్లించేందుకు వీలుగా నిజాం కాలంలో అడ్డుకట్టలు నిర్మించారు. వీటినే కత్వాలు అంటారు. ఆ నీటిని కాల్వల ద్వారా మళ్లించి రైతులు సాగు చేసుకునేవారు. క్రమంగా ఈ కత్వాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నారాయణరావు కత్వా, రావిర్యాల కత్వాల కింద 10 వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యేది.
గేదెలు తినేవి.. అదే గడ్డి...
మూసీ చుట్టూ అధికశాతం గడ్డి భూములున్నాయి. గతంలో వరి పండించిన భూముల్లోనే ప్రస్తుతం గడ్డి సాగుచేస్తున్నారు. దీనికి కూడా కలుషిత నీరే ఆధారం. మూసీ గడ్డికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పీర్జాదీగూడ, బాచారం, మర్రిపల్లి, గౌరెల్లి, బండరావిరాలల్లో పెద్దఎత్తున గడ్డి వ్యాపారం సాగుతోంది. ఒక డీసీఎం గడ్డి 30 వేల ధర పలుకుతోంది. నగర పరిసరాల్లోని పాల డెయిరీలు ఈ గడ్డిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ గడ్డి తిన్న గేదెల పాలు నగరవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. వాటిలో కూడా రసాయన అవశేషాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
కలుషిత జలాలు మూసీ ఒడ్డున కల్లోలం సృష్టిస్తుంటే ఆ జలాలనే కొందరు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. మూసీనది పరివాహకంలో పర్వతాపూర్, కాచవాని సింగారం, కొర్రెముల, ఎదుల్లాబాద్ ఇలా ప్రతి గ్రామంలో కలుషిత నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. బోర్ల వద్ద ట్యాంకర్ల యజమానులు 100 రూపాయలకు నీటిని తీసుకెళ్ళి, సమీప ప్రాంతాల్లో 500 నుంచి 700 రూపాయల వరకు విక్రయించి కలుషిత నీటిని సైతం సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.