అగ్నిపథ్‌ను వ్యతిరేఖిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలకు దిగి విధ్వంసం సృష్టించి... అరెస్టు అయ్యిన యువకులను ఇవాళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇతర కాంగ్రెస్ నాయకులు పరామర్శించనున్నారు. చంచలగూడ జైలులో ఉన్న ఈ యువకులను.. కాంగ్రెస్ నాయకులు కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి చంచలగూడ జైలు సూపరింటెండెంట్‌కు.. దరఖాస్తు చేయగా ఇద్దరికి మాత్రమే నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరొకరికి మాత్రమే ములాఖత్ అయ్యేందుకు అవకాశం కల్పించినట్లు జైలు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 2 విడతల్లో 55 మంది యువకులను జుడీషియల్ రిమాండ్ తరలించారు. వారిలో ఇప్పటి వరకు 46 మందికి ములాఖత్ ఇచ్చారు. ఇంకా మరో 9 మందికి మాత్రమే ములాఖత్ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కూడా.. ఈ 9 మందిలోనే ములాఖత్ కల్పించే అవకాశం ఉందని జైలు వర్గాలు తెలిపాయి. ప్రధాన నిందితులను కాంగ్రెస్ నాయకులకు కల్పించే అవకాశం లేదని తెలుస్తోంది. సికింద్రబాద్ ఘటనకు సంబంధించిన కేసులో బాధితుల పక్షాన పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారుల తరఫున న్యాయపోరాటం చేయనుంది. కేసులో ఉన్నవారంతా విద్యార్థులు అయినందున వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన వారికి న్యాయ సహాయం అందించటం కోసం గాంధీభవన్‌లో 9919931993 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.