రేపు ఉదయం 11 గంటలకు హోటల్ అశోకలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరగనుంది. సమావేశానికి రావాలంటూ పార్టీలో నేతలకు వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి ఫోన్లు చేశారు. సమావేశానికి వెళ్లడంపై పలువురు నేతలు తర్జనభర్జన పడుతున్నారు. సీనియర్ల సమావేశానికి రావాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి వీహెచ్ కోరారు. రేపటి సమావేశానికి ఎవరెవరు హాజరవుతారని ఉత్కంఠ నెలకొంది. ఈనెల 22న దిల్లీ వెళ్లాలని సీనియర్ నేతలు యోచిస్తున్నారు.
దిల్లీకి వెళ్లాలని నిర్ణయం
సోమవారం కూడా మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రజలకు చేరువయ్యేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉండాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. హస్తం పార్టీ బలోపేతమే లక్ష్యంగా హోలీ తర్వాత దిల్లీకి వెళ్లాలని వారు నిర్ణయించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఏఐసీసీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి తదితర అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమై చర్చించారు.
ఎవరెవరు హాజరయ్యారంటే..
సోమవారం భేటీలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్ నాయకులు కమలాకర్‌రావు, జి.నిరంజన్, శ్యాంమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అందర్ని కలుపుకొని వెళ్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి :ఎల్లుండి టీఆర్ఎస్ఎల్పీ భేటీ... అనంతరం దిల్లీకి సీఎం, మంత్రుల బృందం