పురపాలక ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీ ప్రలోభాలకు చేజారకుండా విప్ జారీ చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది. మున్సిపల్ పోరులో క్యాడర్ గట్టిగా పనిచేసిందని పీసీసీ అభిప్రాయపడుతోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. పార్టీ జిల్లా అధ్యక్షులకు ఫోన్ చేశారు. విజేతలను కాపాడుకునే విషయమై దిశానిర్దేశం చేశారు. అవసరాన్ని బట్టి క్యాంపు రాజకీయాలు చేసేందుకు హస్తం నేతలు సిద్ధమవుతున్నారు.
కార్యకర్తలు బాగా పనిచేశారు..
మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో.. బోడుప్పల్, పీర్జాదీగూడ, భువనగిరి, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేటతోపాటు సిరిసిల్ల, కొల్లాపూర్, కామారెడ్డి, నిజామాబాద్ వంటి చోట్ల అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని.. పోలీసుల అండతో రెచ్చిపోయారని పీసీసీ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. చాలా చోట్ల తెరాస కార్యకర్తలు, నాయకుల ప్రలోభాల పర్వాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.