రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు 'స్పీకప్ తెలంగాణ' పేరుతో సామాజిక మాద్యమ ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్స అందించడంలో ప్రభుత్వ తీరుకు నిరసన కార్యక్రమంలో భాగంగా పార్టీ ముందుకెళ్లనుంది. ఈనెల 18 ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 'స్పీకప్ తెలంగాణ' కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని.. రెండు నిమిషాలు వీడియోను సామాజిక మాద్యమాల్లో అప్‌లోడ్ చేయాలని నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పీసీసీ స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కొవిడ్ నిర్ధరణ పరీక్షల నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడింది. చేస్తున్న పరీక్షల్లో పాజిటివ్ రేటు అధికంగా ఉందని, కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని పీసీసీ విమర్శిస్తోంది.
మరొక వైపు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలకు భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు రెండు వారాలపాటు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆరోపిస్తోంది. అనంతరం.. ప్రగతిభవన్‌కు వచ్చిన ముఖ్యమంత్రి వ్యవసాయంపై సమీక్షించడం ఏమిటని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించడం లేదని ఆరోపించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక బిల్లులు చెల్లించలేక విలవిలలాడుతున్నారని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలపై సామాజిక మాద్యమ వేదికగా గళమెత్తాలని కాంగ్రెస్ నిర్ణయించింది.